అమెరికా మార్కెట్లు మళ్లీ ఢమాల్‌..!

అమెరికన్‌ మార్కెట్లు మళ్లీ ఢమాల్‌ అన్నాయి. ఒక రోజు విరామం తరువాత మళ్లీ అమెరికా స్టాక్‌ మార్కెట్లలో భారీ అమ్మకాలకు తెరలేచింది. ద్రవ్యోల్బణ అంచనాలతో ఇన్వెస్టర్లలో తీవ్ర ఆందోళన నెలకొంది. దీంతో గురువారం మార్కెట్లు ఏకంగా 4 శాతం కుప్పకూలాయి.డోజోన్స్‌ 1033 పాయింట్లు(4.15 శాతం) కుప్పకూలి 23,860 వద్ద ముగిసింది. ఈ బాటలో ఎస్‌అండ్‌పీ 101 పాయింట్లు(3.75 శాతం) పతనమై 2581కు చేరగా నాస్‌డాక్‌ 275 పాయింట్లు(4 శాతం) పడిపోయి 6,777 వద్ద స్థిరపడింది. తద్వారా జనవరి 26న నమోదైన గరిష్టాల నుంచి అమెరికా స్టాక్‌ మార్కెట్లు 10 శాతం పతనమయ్యాయి. తొమ్మిది సంవత్సరాల బుల్‌ రన్‌కు బ్రేక్‌ పడిందని మార్కెట్‌ ఎనలిస్టులు వ్యాఖ్యానించారు.

అటు ఆసియన్‌ మార్కెట్లలో షాంఘై 5.22శాతం, నిక్కీ3.22 శాతం పతనం కావడం గమనార్హం. ఈ ప్రభావం ఇండియన్‌ మార్కెట్లపై ఉండనుందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. యూఎస్‌ ఫెడ్‌ వడ్డీ రేట్లను పెంచనున్న అంచనాలు స్టాక్స్‌లో అమ్మకాలకు కారణమవుతున్నట్లు పేర్కొ​న్నారు.