కాసేపట్లో అమరావతికి అంబానీ..

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ కాసేపట్లో నవ్యాంధ్ర రాజధాని అమరావతికి చేరుకోనున్నారు. కొద్ది సేపటిక్రితమే ఆయన ప్రత్యేక విమానంలో ముంబయి నుంచి బయల్దేరారు. మరో గంట సమయంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారని సమాచారం.ఆయనకు స్వాగతం పలికేందుకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ గన్నవరం విమానాశ్రయానికి బయల్దేరారు. గన్నవరానికి చేరుకున్న అనంతరం ముఖేశ్‌ అంబానీ రోడ్డుమార్గం ద్వారానే అమరావతి పరిసరాలను చూస్తూ రియల్‌టైం గవర్నెన్స్‌ (ఆర్టీజీ) కేంద్రానికి చేరుకుంటారు.ఆర్టీజీ గురించి ఆయనకు వివరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. రియల్‌టైం గవర్నెన్స్‌ కేంద్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో అంబానీ సమావేశమవుతారు. గంటపాటు అక్కడే ఉండే అవకాశం ఉంది.అనంతరం ముఖ్యమంత్రి నివాసానికి చేరుకుంటారు. సీఎం నివాసంలో ముఖేశ్‌ అంబానీకి ప్రత్యేక విందు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. దాదాపు ఈ రాత్రి 8గంటల వరకు ముఖేశ్‌ అమరావతిలోనే గడిపే అవకాశం ఉంది.