532 కోట్ల నష్టం లో ఆంధ్ర బ్యాంకు…….!

ఆంధ్రాబ్యాంక్‌ డిసెంబరు 2017తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో 532 కోట్ల రూపాయల నికర నష్టాన్ని ప్రకటించింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన ఆంధ్రాబ్యాంక్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ సుమారు 4,000 కోట్ల రూపాయలుంటుంది. స్మాల్‌ క్యాప్‌ షేర్ల విభాగంలోకి వచ్చే ఈ సంస్థ గత మూడు త్రైమాసికాలుగా నిరుత్సాహకరమైన ఫలితాలనే ప్రకటిస్తోంది. 2017 ఏప్రిల్‌-డిసెంబరు మధ్య 9 నెలల కాలంలో సంస్థ నికరనష్టం మొత్తం 877 కోట్ల రూపాయలుంది. సెప్టెంబరు-డిసెంబరు త్రైమాసికంలో సంస్థ రుణాల రాబట్టే వడ్డీ రాబడి అంతకుముందు ఏడాది ఇదే కాలం కంటే 3 శాతం అధికంగా 4549 కోట్ల రూపాయలుంది.వడ్డీయేతర రాబడి మాత్రం 10 శాతం తగ్గుముఖంతో 544 కోట్ల రూపాయలకు చేరింది.

వాస్తవానికి ఈ త్రైమాసికంలో సంస్థ వ్యయాలను గణనీయంగా తగ్గించుకుంది. వడ్డీల వ్యయం 10 శాతం తగ్గుముఖం పట్టి 3,191 కోట్ల రూపాయల నుంచి 2,877 కోట్ల రూపాయలకు చేరింది. దీంతో నికర వడ్డీ ఆదాయం అంతకుముందు ఏడాది (1,218 కోట్ల రూపాయలు) కంటే 37 శాతం అధికంగా 1,672 కోట్ల రూపాయలుంది. అయితే పెరిగిపోతున్న మొండిపద్దుల భారం దృష్ట్యా ప్రొవిజన్స్‌ అండ్‌ కాంటిన్జెన్సీస్‌ కింద 1,862 కోట్ల రూపాయలు కేటాయించాల్సి రావడం బ్యాంక్‌ను నష్టాల్లోకి నెట్టింది.

ఈ పద్దులో గతేడాది ఇదే కాలం (853 కోట్ల రూపాయలు) కంటే 118 శాతం ఎక్కువగా కేటాయింపులు జరపాల్సి వచ్చింది. బ్యాంక్‌ స్థూల మొండి పద్దుల (ఎన్‌పిఎ) మొత్తం డిసెంబరు త్రైమాసికంలో 19839 కోట్ల రూపాయల నుంచి 21,599 కోట్ల రూపాయలకు చేరింది. నికర మొండిపద్దుల మొత్తం (7.55 శాతం) 10,858 కోట్ల రూపాయలుంది.