శ్రీను ఎలావున్నావ్…..ఏంజరగలేదుగా…!

రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గ్రామీణ గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు, జడ్పీ చైర్మన్‌ పూల నాగరాజుకు త్రుటిలో ప్రాణా పాయం తప్పింది. బెళుగుప్ప మండల పరిధిలోని కాలువపల్లి వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

కళ్యాణదుర్గం మండలం గోళ్లలో మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్‌ బాదన్న వర్ధంతి సభకు వారు అనంతపురం నుంచి వస్తున్నారు. ఇదే సమయంలో బెళుగుప్పకు చెందిన ఏపీ02బీఆర్‌ 0244 కారు అనంతపురం వెళుతుండగా కాలువపల్లితండా పాఠశాల సమీపంలో పంక్చరై మంత్రి సెక్యురిటీ వాహనాన్ని ఢీకొంది.

గమనించిన మంత్రి కారు డ్రైవర్‌ అప్రమత్తమై తమ వాహనాన్ని రోడ్డు పక్కకు తిప్పి ప్రమాదం నుంచి కాపాడారు. టైరు పంక్చర్‌ కావడంతోనే కారు అదుపుతప్పిందని గుర్తించారు. ఈ ప్రమాదంలో రెండు కార్లు దెబ్బతిన్నాయి. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో పోలీసు సిబ్బంది, మంత్రి ఊపిరి పీల్చుకున్నారు.

శీనూ ఎలా ఉన్నావ్‌… ఏమి జరగలేదుగా అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్‌లో పరామర్శించారు. మంత్రి కాలవ శ్రీనివాసులు వాహనం ప్రమాదానికి గురైన విషయం తెలుసుకున్న సీఎం ఫోన్‌లో మంత్రితో మాట్లాడి ఘటన గురించి ఆరా తీశారు. ఏమి కాలేదు కదా… వెరీగుడ్‌ అంటూ ఆనందం వ్యక్తం చేశారు.