యుద్ధ వీరుడిలా బిగ్ బి ….!

బాలీవుడ్‌ సూపర్ స్టార్ ,సిల్వర్ స్రీన్ షాహన్ష , బిగ్ బి అమితాబ్‌ బచ్చన్‌, ఆమిర్‌ ఖాన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’. విజయ్‌ కృష్ణ ఆచార్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ లోగోను చిత్రబృందం విడుదల చేసింది. ఇప్పుడు సినిమాలోని అమితాబ్‌ ఫస్ట్‌లుక్‌ను పంచుకుంది. ఈ చిత్రంలో బిగ్‌బి కమాండర్‌ ఖుదాబక్ష్‌ అనే పాత్రలో నటిస్తున్నారు. ఫస్ట్‌లుక్‌లో ఆయన గెటప్‌ అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఇంతవరకు ఇలాంటి గెటప్‌లో అమితాబ్‌ను ఎప్పుడూ చూసింది లేదు. తలపాగా, తెల్లటి మీసం, చేతిలో కత్తితో ఓ వీరుడిలా బిగ్ బి కనిపిస్తున్నారు . ఎక్కువగా సముద్రం, పడవల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సినిమా కోసం భారీ పడవలను రూపొందించారు. సినిమాలో సముద్రం, పడవలే ప్రధాన పాత్రలని భావించిన చిత్రబృందం వాటి కోసం కోట్లల్లో ఖర్చు చేస్తున్నట్లు బాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. ఇప్పటివరకు హిందీ చిత్ర పరిశ్రమ కనీవినీ ఎరుగని రీతిలో ఈ సినిమాను తెరకెక్కించాలని ఆమీర్ , నిర్మాత ఆదిత్య చోప్రా భావిస్తున్నారట.

యూరప్‌లోని మాల్టా సముద్రతీరంలో ఈ పడవలను రూపొందించారు. వీటిని తయారుచేయడానికి ఏడాది సమయం పట్టిందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. అబ్బురపరిచే విజువల్ ఎఫెక్ట్స్‌తో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో కత్రినా కైఫ్‌, ఫాతిమా సనా షేక్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. యశ్‌ రాజ్‌ ఫిలింస్‌ సంస్థ నిర్మిస్తోంది.