అమాంతం కుప్పకూలిన స్టాక్‌మార్కెట్లు..యస్‌ బ్యాంక్‌ షేర్లు ఢమాల్‌….!

stock market, Trendingandhra

 స్టాక్ మార్కెట్లు మళ్లీ కుప్పకిలిపోయాయి. అంతర్జాతీయ సానుకూలతలతో మొదట లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు, ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడిని తట్టుకోలేక ఫై నుండి అమాంతం కుప్పకూలాయి.

ఈ ఉదయం సూచీలు అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతలు, రూపాయి కోలుకోవడంతో ఉత్సాహంగా ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్‌ ఆరంభంలో సెన్సెక్స్‌ 300 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ కూడా 11,300 మార్క్‌ పైన ట్రేడ్‌ అయ్యింది. అయితే బ్యాంకింగ్‌, ఆటోమొబైల్, ఎఫ్‌ఎంసీజీ ఆర్థిక సంస్థల షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాల ముందు సూచీలు నిలబడలేకపోయాయి. ఆరంభ లాభాలను కోల్పోయి నష్టాల్లోకి జారుకున్నాయి. ఒక దశలో బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ 1000 పాయింట్లకు పైగా పతనమైంది. దీంతో కీలక 36వేల మైలరాయిను కోల్పోయింది. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 11,000 మార్క్‌ దిగువన ట్రేడ్‌ అయ్యింది.

stock market , trendingandhra

అయితే ప్రస్తుతం భారీ నష్టాల నుంచి సూచీలు కాస్త కోలుకున్నాయి. సెన్సెక్స్‌ 279 పాయింట్లు నష్టపోయి 36,842 వద్ద, నిఫ్టీ 74 పాయింట్లు పతనమై 11,160 వద్ద ముగిసాయి.

ప్రయివేటు రంగ యస్‌ బ్యాంక్ షేర్లు శుక్రవారం కుప్పకూలాయి. బ్యాంకు సీఈవో, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాణా కపూర్‌ పదవీకాలం పొడగింపును రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అంగీకరించకపోవడంతో ఆ ప్రభావం షేర్లపై పడింది. శుక్రవారం ఆరంభ ట్రేడింగ్‌ నుంచే భారీ నష్టాలతో మొదలైన బ్యాంకు షేరు విలువ ఒక దశలో 34శాతం తగ్గి 52 వారాల కనిష్ఠానికి పడిపోయింది.