మళ్ళీ పతనమైన స్టాక్ మర్కెట్స్ ……!

మార్కెట్‌ మళ్లీ నేల వైపు చూసింది . ఓవైపు అమెరికా-చైనా మధ్య మళ్లీ వాణిజ్య యుద్ధ పరిస్థితులు.. మరోవైపు రూపాయి పతనం దేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. అంతర్జాతీయ వాణిజ్య అనిశ్చితుల నేపథ్యంలో ఆసియా మార్కెట్లు దెబ్బకి కిందపడ్డాయి . దీనికి తోడు రూపాయి బలోపేతానికి ప్రభుత్వం తీసుకోబోయే చర్యలు కూడా అసంతృప్తిగా ఉండటం మార్కెట్ల నష్టానికి మరింత ఆజ్యం పోశాయి. ఫలితంగా ట్రేడింగ్‌ ఆరంభం నుంచి అమ్మకాల ఒత్తిడిలో కూరుకుపోయిన సూచీలు చివరకు భారీగా పతనమయ్యాయి.

ఆసియా మార్కెట్ల ప్రతికూల ప్రభావంతో ఈ ఉదయం సూచీలు నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్‌ ఆరంభంలో సెన్సెక్స్ 350 పాయింట్లకు పైగా కోల్పోగా.. నిఫ్టీ కూడా 100 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడ్‌ అయ్యింది. ఇ చివరి గంటల్లో సెన్సెక్స్‌ 511 పాయింట్ల వరకు నష్టపోయింది. చివరకు 505 పాయింట్లు నష్టపోయి 37,585 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 137 పాయింట్ల నష్టంతో 11,378 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 59పైసలు నష్టపోయి 72.44గా కొనసాగుతోంది.

ఎన్‌ఎస్‌ఈలో భారత్‌ పెట్రోలియం, హిందుస్థాన్‌ పెట్రోలియం, టెక్‌మహీంద్రా, ఇండియన్ ఆయిల్‌ కార్పొరేషన్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేర్లు స్వల్పంగా లాభపడగా.. బజాజ్‌ ఫైనాన్స్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, టైటాన్‌, సన్‌ఫార్మా, బజాజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ షేర్లు నష్టపోయాయి.