తెలంగాణ ఎన్నిక‌లు : ఇప్పటి వ‌ర‌కు పోలీసులు సీజ్ చేసిన న‌గ‌దు ఎంతో తెలిస్తే షాక్‌..!

cash seized in telangana assembly elections,trendingandhra
తెలంగాణ పోలీసుల సోదాలు, ఐటీశాఖ‌ల దాడుల్లో ప్ర‌తీ రోజు డ‌బ్బుల క‌ట్ట‌లు దొరుకుతూనే ఉన్నాయి.  నిజానికి అసెంబ్లీ ర‌ద్దైన నాటి నుంచే తెలంగాణ‌లో నోట్ల కట్ట‌ల ప్ర‌వాహం మొద‌లైంది. ఆదిలాబాద్‌లో ఒక్క రోజే 10 కోట్ల రూపాయ‌లు దొర‌క‌డంతో పోలీసుల‌తోపాటు ప్ర‌జ‌లు కూడా షాక్ తిన్నారు. టీడీపీకి చెందిన ఓ నేత వ‌ద్ద ఏకంగా 50 ల‌క్ష‌ల రూపాయ‌లు దొరికాయి. పోలీసు సోదాల్లో దొరికిన సొమ్ములో కొంత మంది లెక్క‌లు చెప్పి త‌మ సొమ్మును తీసుకెళ్తే.. మ‌రికొంత మంది ఇంత వ‌ర‌కు రాలేదు. పోలీసులు, ఐటీ అధికారుల దాడుల్లో ఇప్ప‌టి వ‌ర‌కు వంద కోట్ల వ‌ర‌కు దొరికిన‌ట్టుగా తేలింది. 
 
పోలింగ్‌కు గ‌డువు ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో దానికి ముందు రోజు ప్ర‌జ‌ల‌ను ప్ర‌లోభ‌పెట్టేందుకు ప్ర‌ధాన పార్టీల వందల కోట్ల రూపాయ‌ల‌ను హ‌వాలా మార్గంలో మళ్లించిన‌ట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే న‌గ‌రంలో అనేక ప్రాంతాల్లో హ‌వాలా దందా జోరుగా న‌డుస్తుంది. ఎన్నిక‌ల స‌మ‌యంలో హ‌వాలా వ్యాపారులకు గిరాకీ పెరిగింది. పోలీసులు ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ది శాతం న‌గ‌దును మాత్ర‌మే ప‌ట్టుకున్నార‌ని, అక్ర‌మంగా చ‌లామ‌ణిలో ఉన్న న‌గ‌దు చాలానే ఉందనే టాక్ న‌డుస్తుంది.
 
ఇరాక్ నుంచి ముంబై మీదుగా హైద‌రాబాద్‌లోని బేగం బ‌జార్‌కు హ‌వాలా న‌గ‌దు వ‌స్తున్న‌ట్టుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు ప‌ట్టుకున్న సొమ్ము ఎక్క‌డ్నుంచి..?  ఆ సొమ్ము ఎవ‌రి వ‌ద్ద‌కు వెళుతుంది..? అన్న వివ‌రాలు పోలీసుల విచార‌ణ‌లో తెలియాల్సి ఉంది. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్‌ అనంత‌రం సోదాల్లో భాగంగా దొరికిన సొమ్ములో  90 కోట్ల రూపాయ‌ల‌ను పోలీసులే ప‌ట్టుకున్నారు. ఇందులో 50 కోట్ల రూపాయ‌లు ఒక్క హైద‌రాబాద్ లోనే దొరికాయి. ఐటీ అధికారుల దాడుల్లో 10 కోట్ల రూపాయ‌లు ప‌ట్టుబ‌డ్డాయి. కొన్ని రోజుల కింద‌ట హైద‌రాబాద్‌లో ఏడు కోట్ల రూపాయ‌లు దొరికాయి. 
 
కొడంగ‌ల్ తెరాస అభ్య‌ర్థి నివాసంలో 50 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు వివిధ విభాగాల అధికారులు సీజ్ చేసిన న‌గ‌దుకు లెక్క‌లు చెప్ప‌లేద‌ని ఐటీ అధికారులు చెబుతున్నారు. గుజ‌రాత్‌, క‌ర్ణాట‌క, మ‌హారాష్ట్ర నుంచి పెద్ద మొత్తంలో హైద‌రాబాద్‌కు హ‌వాలా మార్గంలో డ‌బ్బులు వ‌స్తున్న‌ట్టుగా తెలుస్తుంది. బేగంబ‌జార్‌తోపాటు జ‌న‌ర‌ల్ బ‌జార్‌లోనూ హ‌వాలా వ్యాపారులు చాలా మందే ఉన్నారు. వీరే పార్టీల ముఖ్య నేత‌ల‌కు సొమ్మును చేర‌వేస్తున్న‌ట్టుగా పోలీసులు వ‌ర్గాలు అనుమానాల‌ను వ్య‌క్తం చేస్తున్నాయి. హ‌వాలా వ్యాపారులు మారుమూల ప్రాంతాల్లోనూ నెట్‌వ‌ర్క్‌ను ఏర్పాటు చేసుకోవ‌డంతో న‌గ‌దు స‌ర‌ఫ‌రా చాలా ఈజీగా జ‌రుగుతుంది. అధికారుల క‌ళ్లుగ‌ప్పి వేగంగా న‌గ‌దును త‌ర‌లిస్తున్నారు. రేపు, ఎల్లుండి వ‌ర‌కు ఈ నెట్‌వ‌ర్క్ మ‌రింత కీలకంగా ప‌నిచేసే అవ‌కాశాలు ఉన్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో తెలుగు రాష్ట్రాల్లో 120 కోట్ల రూపాయ‌లు దొరికాయి. ఈ సారి ఒక్క తెలంగాణ‌లోనే వంద కోట్ల రూపాయ‌లు దొర‌క‌డం సంచ‌ల‌నం రేపుతోంది.