తెలంగాణ నీళ్ల‌ను దోచుకెళ్ల‌లేదు : చంద్ర‌బాబు

 
chandrababu election campaign for bhavya ananda prasad,trendingandhra
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షులు, న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు తెలంగాణ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ముమ్మ‌ర ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. అయితే, ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి, తెరాస అధినేత క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు నిరంకుశ విధానాల‌కు వ్య‌తిరేకంగా ఒక‌ట‌వుతున్నామంటూ కాంగ్రెస్‌, టీడీపీ, తెలంగాణ జ‌న స‌మితి, ఇంకా ప‌లు పార్టీలు క‌లిసి మ‌హా కూట‌మిగా ఏర్ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే బుధ‌వారం నాడు చంద్ర‌బాబు నాయుడు, కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షులు రాహుల్ గాంధీ ఖ‌మ్మం కేంద్రంగా జ‌రిగిన మ‌హా కూట‌మి ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో ప్ర‌సంగించారు. మ‌హాకూట‌మి ఎమ్మెల్యే అభ్య‌ర్థుల‌కు ప్ర‌జ‌లు మ‌ద్ద‌తు తెల‌పాల‌ని కోరారు. 
 
ఇదిలా ఉండ‌గా, ఖ‌మ్మంలో ఒకే వేదిక‌పై క‌లిసి ప్ర‌సంగించిన చంద్ర‌బాబు, రాహుల్ గాంధీ నేడు (గురువారం) వారి వారి పార్టీల అభ్య‌ర్థులు పోటీ చేస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేశారు. అందులో భాగంగా. శేరిలింగంప‌ల్లి టీడీపీ అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్న భ‌వ్య ఆనంద ప్ర‌సాద్‌కు మ‌ద్ద‌తుగా ఇవాళ చంద్ర‌బాబు నాయుడు ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. 
 
భ‌వ్య ఆనంద ప్ర‌సాద్‌కు మ‌ద్ద‌తుగా ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ..  పోరాడి తెలంగాణ సాధించుకున్నాం అంటూ ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టి మ‌రీ కేసీఆర్ అవినీతి పాల‌న‌ను కొన‌సాగిస్తున్నారంటూ మండిప‌డ్డారు. ఏపీ సీఎంగా ఉన్న నాపై  తెలంగాణ నీళ్లు దోచుకెళ్లాడంటూ తెరాస నేత‌లు ప్ర‌చారం చేస్తున్నార‌ని, ఆ ప్ర‌చారంలో కూసంత కూడా నిజం లేద‌న్నారు. తెలంగాణ‌కు నీళ్లు తెచ్చిన వాడిని.. నీళ్లెలా దోచుకుంటాన‌ని తెరాస నేత‌ల‌ను ఎదురు ప్ర‌శ్నించారు. తాను ఉమ్మ‌డి ఏపీ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలోనే దేవాదుల‌, భీమా ప్రాజెక్టులు, క‌ల్వ‌కుర్తి ప్రాజెక్టుల‌కు అనుమ‌తులు ఇచ్చిన‌ట్టు గుర్తు చేశారు చంద్ర‌బాబు. 
 
తెరాస‌, బీజేపీ బంధం బ‌ల‌ప‌డిన సంద‌ర్భంగానే తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌చ్చాయ‌ని, కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసిన వెంట‌నే ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయ‌ని, ఈ విష‌య‌మే బీజేపీ, తెరాస బంధానికి నిద‌ర్శ‌న‌మ‌న్నారు చంద్ర‌బాబు. తెరాస‌, బీజేపీ నేత‌లు తెర వెనుక ఆడుతున్న నాట‌కాల‌ను తెలంగాణ ప్ర‌జ‌లు గ‌మ‌నించార‌ని, ఆ పార్టీల ఓటు అనే ఆయుధంతో డిసెంబ‌ర్ 7న బుద్ధి చెబుతారంటూ ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు అన్నారు.  ఎన్నిక‌లు