ఏడాది శిక్షను పూర్తి చేసుకున్న చిన్నమ్మ…!

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి తర్వాత పార్టీపై, పాలనపై పట్టు సాధించి ఇక కొద్ది రోజుల్లో సీఎం సీటులో కూర్చుంటానని కలలు కన్న శశికళ ఆశలన్నీ అడియాసలుగా మారిన రోజు ఇది.

అక్రమార్జన కేసులో సుప్రీం కోర్టు తీర్పు వెలువడి ఏడాది పూర్తయ్యింది. గత ఏడాది ఫిబ్రవరి 14న సుప్రీం కోర్టు శశికళకు దిగువ కోర్టు విధించిన నాలుగేళ్ల జైలు శిక్షను ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది. అప్పటికే అన్నాడీఎంకే శాసనసభ్యులందరినీ కూవత్తూరు రిసార్ట్స్‌లో దాచి ఉంచారు.

తనను ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేయించడానికి అప్పటి ఇన్‌చార్జి గవర్నర్‌ అంగీకరించరని నిర్ధారించుకుని, ఎడప్పాడిని శాసనసభా పక్ష నాయకుడిగా ఎంపిక చేసిన శశికళ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా తన బాధ్యతలను నెరవేర్చారు. తీర్పు వెలువడిన మరుసటి రోజే ఆమె బెంగళూరు పరప్పన అగ్రహారం జైలుకు పయనమయ్యారు. శశికళ జైలుకెళ్లి ఏడాది పూర్తయ్యింది.

ఈ ఏడాదిలో రాష్ట్రంలో రాజకీయంగా ఎన్నో మార్పులు సంభవించాయి. ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత ఎడప్పాడి పళనిస్వామి శశికళ కుటుంబమంతటినీ పార్టీకి, పాలనకు దూరం చేసి, శాసనసభ్యుల మద్దతును చక్కగా కూడగట్టుకున్నారు. ధర్మయుద్ధమంటూ పార్టీ నుంచి విడిపోయిన మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ముఖ్యమంత్రి ఎడప్పాడి వర్గంలో చేరిపోయారు.

దినకరన్‌ ఎప్పటి వలే అసమ్మతి వర్గం నాయకుడిగా రాజకీయాలు నడుపుతూ ఆర్కే నగర్‌ ఎన్నికల్లో గెలిచి అధికార పార్టీని మట్టి కరిపించారు. ఇక జైల్లో శశికళకు విలాసవంతమైనసదుపాయాలు ఏర్పాటు చేశారని, పోలీసుల కళ్ళుగప్పి బెంగళూరులో షాపింగ్‌లకు వెళ్లారంటూ వీడియో ఆధారాలు వెలువడ్డాయి. వీటిని వెలుగులోకి తెచ్చిన మహిళా పోలీసు ఉన్నతాధికారిపై బదిలీ వేటు పడింది. ఇక శశికళ భర్త నటరాజన్‌ కిడ్నీ సమస్యలతో అనారోగ్యానికి గురికావటంతో ఐదు రోజుల పెరోల్‌పై శశికళ చెన్నైకి వచ్చారు.

పెరోల్‌ నిబంధనల ప్రకారం ఆమె టి. నగర్‌లోని ఇళవరసి కుమార్తె ఇంట్లోనే గడిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భర్తను పరామర్శించటంతోనే సరిపెట్టుకుని వెళ్లిపోయారు. చివరగా జస్టిస్‌ ఆర్ముగస్వామి కమిటీ సమన్‌కు దీటైన ప్రత్యుత్తరం ఇచ్చి సంచలనం సృష్టించారు.

జయలలిత మృతిపై తనను అనుమానిస్తూ సాక్ష్యం చెప్పినవారి జాబితాను ఇస్తేనే సమన్‌కు సమాధానం చెబుతానంటూ మెలికపెట్టారు. గత ఏడాది డిసెంబర్‌ 5న జయ వర్ధంతి నాడు మౌన వ్రతం చేపట్టిన శశికళ రెండు రోజుల ముందే ఆ దీక్షను విరమించుకున్నారు. ఇలా శశికళ నాలుగేళ్ల జైలు శిక్షలో ఏడాది శిక్షను పూర్తి చేసుకున్నారు.