కరుణానిధి స్క్రీన్ ప్లే అందించిన చివరి తెలుగు చిత్రం

తమిళనాడు ప్రియతమ నేత.. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి తెలుగు చిత్ర పరిశ్రమతోనూ అనుబంధం ఉంది. రాజకీయంగా తాను ఎంత బిజీగా ఉన్నా, తెలుగు సినిమా కార్యక్రమాలకు అప్పుడప్పుడు హాజరయ్యేవారు.

ప్రముఖ నిర్మాత రామానాయుడు 1971లో నిర్మించిన ‘ప్రేమనగర్‌’ చిత్రం శతదినోత్సవానికి కరుణానిధి హాజరై నటీనటులకు, సాంకేతిక నిపుణులకు జ్ఞాపికలు అందించారు.

దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ‘నీడ’ సినిమా శతదినోత్సవానికి కూడా కరుణానిధి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక హీరో కృష్ణ నటించిన ‘అమ్మాయి మొగుడు-మామకు యముడు’ చిత్రానికి కరుణానిధి స్క్రీన్‌ప్లే అందించారు.

1947లో విడుదలైన ‘రాజకుమారి’ నుంచి 2011లో వచ్చిన ‘పొన్నర్‌ శంకర్’ వరుకు పలు చిత్రాలకు కరుణానిధి కథారచయితగా, సంభాషణల రచయితగా, పాటల రచయితగా, స్క్రీన్‌ప్లే రైటర్‌గా వ్యవహరించారు. కరుణానిధి కథ అందించిన చివరి చిత్రం ‘పొన్నర్‌ శంకర్’. 1970లలో కరుణానిధి రాసిన ‘పొన్నర్‌ శంకర్‌’ నవల ఆధారంగా నటుడు త్యాగరాజన్‌ తన కుమారుడు ప్రశాంత్‌ని హీరోగా పెట్టి సినిమా తీశారు. 2011లో తమిళంలో విడుదలైన ఈ చిత్రం 2012లో తెలుగులో ‘రాజకోట రహస్యం’ టైటిల్‌తో రిలీజ్‌ అయింది.