2.0 థాట్ ఎలా వ‌చ్చిందో చెప్పిన డైరెక్ట‌ర్ శంక‌ర్‌

shanker comments about 2.O movie,trendingandhra
 
ర‌జ‌నీకాంత్ క‌థానాయ‌కుడిగా న‌టించిన 2.0 గురించి ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంత ఆస‌క్తి ఉందో అంద‌రికీ తెలిసిందే.  శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా భారీ విజ‌యం సాధించిన రోబోకు సీక్వెల్ కావ‌డం సుమారు రూ.500 కోట్ల‌తో రూపొందించిన  అత్యంత భారీ చిత్రం కావ‌డంతో విడుద‌ల‌పై స‌ర్వ‌త్రా  ఆస‌క్తి ఎంత‌గానో ఉంది. విజువల్ ఎఫెక్ట్స్‌కు  సంబంధించిన ప‌నులు పూర్తి కాక‌పోవ‌డంతో ప‌లుమార్లు వాయిదాప‌డిన ఈ చిత్రం ఎట్ట‌కేల‌కు ఈ నెల 29న విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. 
 
ఇదిలా ఉండ‌గా, ఇటీవ‌ల కాలంలో 2.ఓ చిత్ర బృందం ప్రమోష‌న్స్‌ను వేగ‌వంతం చేసిన సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగా కోలీవుడ్‌తోపాటు దేశంలోని చిత్ర ప‌రిశ్ర‌మ‌ల‌న్నిటిని చుట్టేస్తుంది శంక‌ర్ బృందం. అయితే, హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన చిత్ర ప్ర‌మోష‌న్స్ ప్రెస్ మీట్‌లో ర‌జ‌నీకాంత్‌తో పాటు డైరెక్ట‌ర్ శంక‌ర్‌, బాలీవుడ్ హీరో అక్ష‌య్ కుమార్ పాల్గొన్నారు. మీడియా అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆస‌క్తిక‌ర స‌మాధానాల‌ను చెప్పారు.
 
2.ఓ చిత్రానికి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర విష‌యాన్ని వెల్ల‌డించారు డైరెక్ట‌ర్ శంక‌ర్‌. త‌న‌లో డైరెక్ట‌ర్‌తోపాటు ఒక సినీ ప్రేక్ష‌కుడు కూడా ఉన్నాడ‌ని, త‌న‌లో ఉన్న ఆ ఇద్ద‌రు సంతృప్తి చెందితేనే ఏ సినిమా అయినా త‌న ద‌ర్శ‌క‌త్వంలో బ‌య‌ట‌కు వ‌స్తుంద‌న్నారు. డైరెక్ట‌ర్ అన్న వాడు ప్రేక్ష‌కుడి అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా సినిమాను తెర‌కెక్కించాల‌న్నారు. అది తాను బాధ్య‌త‌గా తీసుకుంటాన‌న్నారు. ఈ క్ర‌మంలోనే ద‌ర్శ‌కుడి ఆలోచ‌న‌ల‌కు ప్రేక్ష‌కుడు, ప్రేక్ష‌కుడి ఆలోచ‌న‌ల‌కు డైరెక్ట‌ర్ ఇలా ఇద్ద‌రూ ప‌ర‌స్ప‌రం గౌర‌వించుకోవాల‌న్నారు. 
 
 
ఈ చిత్రంలో మీరు మొబైల్ స‌బ్జెక్ట్‌ను ఎంచుకోవ‌డానికి గ‌ల కార‌ణ‌మేంట‌ని అడిగిన విలేక‌రి ప్ర‌శ్న‌కు శంక‌ర్ సమాధానం చెబుతూ ఒక రోడ్డు మీద మొబైల్స్ అన్నీ వెళ్తుంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచ‌న నుంచి పుట్టిందే 2.0 అని స‌మాధానం ఇచ్చారు డైరెక్ట‌ర్ శంక‌ర్‌.