సీబీఐ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ ఆందోళనలు !

congress , cbi , trendingandhra

సీబీఐ డైరెక్టర్‌ ఆలోక్‌ వర్మను సెలవుపై పంపిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై నేడు దేశవ్యాప్తంగా నిరసనకు దిగింది. దేశంలోని అన్ని సీబీఐ కార్యాలయాల ఎదటు కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయం వద్ద కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆందోళనలో పాల్గొన్నారు. రాహుల్‌తో పాటు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు ఆనంద్‌ శర్మ, వీరప్ప మొయిలీ, సీపీఐ నాయకులు డి. రాజా, శరద్‌ యాదవ్‌ తదితరులు ఈ నిరసన కార్యక్రమానికి హాజరయ్యారు.

సీబీఐ ప్రతిష్ఠ దెబ్బతీశారంటూ కాంగ్రెస్‌ ఈ నిరసన ప్రదర్శన చేపట్టింది. దయాళ్‌సింగ్‌ కళాశాల నుంచి సీబీఐ కార్యాలయం వరకు కాంగ్రెస్‌ ర్యాలీ నిర్వహించింది. సీబీఐ డైరెక్టర్ ఆలోక్‌ వర్మను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కాంగ్రెస్‌ ఈ సందర్భంగా డిమాండ్‌ చేస్తోంది. మరోవైపు రాహుల్‌గాంధీ నిరసన కార్యక్రమానికి తృణమూల్‌ కాంగ్రెస్‌ మద్దతు తెలిపింది.

కాగా.. ఆందోళనల నేపథ్యంలో సీబీఐ కార్యాయలం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కార్యాలయం ఎదుట కేంద్ర బలగాలు, దిల్లీ పోలీసులు భారీగా మోహరించాయి. సీబీఐ కార్యాలయానికి 300 మీటర్ల దూరంలో బారికేడ్లతో పోలీసులు రహదారిని మూసివేశారు.

యూపీ, బిహార్‌, కర్ణాటక, తెలంగాణ తదితర రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌ ఈ నిరసన ప్రదర్శనలు చేపట్టింది. బెంగళూరులో చేపట్టిన ఆందోళనలో కాంగ్రెస్‌ కార్యకర్తలు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. చండీగఢ్‌లోని సీబీఐ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న కాంగ్రెస్‌ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. నీటిపంపుల ద్వారా నిరసనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు.