టీవీ (ప్రసార మాధ్యమాలు)ఇకపై  చూడాలంటే కష్టమే ?

New Changes of Tv Media.., GST Charges to TV Channels, Trendingandhra
జనవరి 1 నుండి నూతన మార్పులు
100 ఉచిత చానళ్లకు రూ 130+ జీఎస్టీ. ఆ  పై ఛానెల్స్ కి  విడిగా  చెల్లింపులు…!

రానున్న కొత్త ఏడాది నుంచి నూతన డీటీహెచ్‌ తరహాలో కేబుల్‌ టీవీ ధరలు.

పద్ధతిలో ఇకపై కేబుల్‌ టీవీ కనెక్షన్‌కు కూడా ప్రీపెయిడ్‌ పద్ధతిలోనే చెల్లింపులు జరపాల్సి వస్తుంది. 100 ఉచిత చానళ్లను మాత్రం కేబుల్‌ టీవీ సంస్థలన్నీ రూ.130+జీఎస్‌టీకి వసూలు చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత కావాల్సిన ఇతర చానళ్లకు మాత్రము చెల్లింపులు జరిపితే సరిపోతుంది. అయితే ప్రస్తుతం లభిస్తున్న చానళ్లన్నీ చూడాలంటే మాత్రం ధర గణనీయంగా పెరుగుతుంది. కనీసం తెలుగులో సీరియళ్లు, సినిమాలు ప్రసారం చేసే చానళ్లన్నీ చూడాలన్నా కూడా, ప్రస్తుతం కంటే ఎక్కువ మొత్తమే (కనీసం ధర రూ.300కు పైగా) చెల్లించాల్సి వస్తుందనే అభిప్రాయాన్ని మాస్టర్‌ నెట్‌వర్క్‌ ఆపరేటర్లు వ్యక్తం చేస్తున్నారు. హెచ్‌డీ చానళ్లకు మరింత అధికంగా ధర ఉండొచ్చు. ఇప్పటికే టీవీ చానళ్ల యాజమాన్యాలు, తమ ప్రసారాలకు ఎంత వసూలు చేసేదీ ప్రకటించారు కూడా. స్టార్‌, జీటీవీ వంటి నెట్‌వర్క్‌లు తమ సొంత ప్యాకేజీలు వెల్లడించాయి. ఈటీవీ చానళ్ల ప్రసారాలు కూడా ఇదేవిధంగా ప్రత్యేక ప్యాకేజీగా వచ్చే అవకాశముంది. ప్యాకేజీలుగా ప్రకటించేవి తీసుకుంటేనే, తక్కువ మొత్తం అయ్యే వీలుందనీ చెబుతున్నారు. వినియోగదారులు తమకు అక్కర్లేని చానల్‌ కూడా చూడాల్సిన పరిస్థితి ఇప్పటివరకు ఉండగా, ఈ బాధ ఇకపై తప్పనుంది.  

ఇప్పటివరకు కేబుల్‌ టీవీ అంటే, నెలకు ఇంతని చెల్లించి, వారు ప్రసారం చేసే చానళ్లు చూసేవాళ్ళం. అనలాగ్‌ నుంచి డిజిటల్‌కు ప్రసారాలు మార్చి, సెట్‌టాప్‌ బాక్స్‌ ఏర్పాటు చేశాక కూడా పరిస్థితేమీ మారలేదు. చిత్రం, మాటలో స్పష్టత మాత్రం పెరిగింది. పట్టణాలు, నగరాల్లో 250 నుంచి 400 చానళ్ల వరకు ప్రసారాలకు వేర్వేరు సంస్థలు రూ.200-400 వరకు వసూలు చేస్తున్నాయి. వీటిలో ఉచితంగా లభించే వార్తా చానళ్లతో పాటు వినోదం, చిత్రాలు, వంటల ప్రోగ్రామలు, క్రీడాచానళ్లు, హిందీ-ఆంగ్ల-తమిళం-మళయాళం-ఉర్దూ చానళ్లు కూడా ఉంటున్నాయి. నగరాల్లోని మాస్టర్‌ ఆపరేటర్‌ చేసే ప్రసారాల్లో, స్థానిక ఆపరేటర్‌ తన ప్రాంత వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా ఆయా చానళ్లకు ప్రసారం చేస్తున్నారు. సెట్‌టాప్‌ బాక్స్‌లు ఏర్పాటు చేశాక, ప్రధానమైన మాస్టర్‌ ఆపరేటర్‌కు తన పరిధిలో ఎంతమంది వినియోగదారులు తిలకిస్తున్నారనే కచ్చితమైన లెక్క ఏర్పడింది, తదనుగుణంగా ఆదాయమూ పెరిగింది. నెలంతా తిలకించాక, కేబుల్‌ ఆపరేటర్‌కు డబ్బులు కట్టే పద్ధతి ఇప్పుడు అమల్లో ఉంది. 

 అదే డీటీహెచ్‌ సంస్థలైతే, ఎప్పుడూ డిజిటల్‌గానూ ప్రసారాలు జరుగుతున్నాయి. వీటిలో చానళ్లకు విడివిడిగా చెల్లింపులు, భాషా పరంగా, క్రీడలు/సినిమాలు, ఆంగ్లభాషా చిత్రాలు, వినోద కార్యక్రమాలు ప్రసారం చేసే చానళ్లను విడివిడిగా ప్యాకేజీలుగా ధర నిర్ణయించి, వసూలు చేస్తున్నాయి. వీటికి ముందస్తు చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. నెల, 3 నెలలు, 6 నెలలకు ముందస్తుగా చెల్లింపులు జరిపి, ప్రసారాలు తిలకించే వీలుంది. కొన్ని నెలలపాటు ముందస్తు చెల్లింపులకు మాత్రం కొంత రాయితీ లభిస్తోంది. 

Image result for New Changes of Tv Media..,మాస్టర్‌ ఆపరేటర్లు ఎన్ని వందల చానళ్లు ప్రసారం చేస్తున్నా, సగటున వినియోగదారులు 14 చానళ్లు మాత్రమే చూస్తున్నారని ఒక అధ్యయనంలో తేలినట్లు పరిశ్రమ ప్రముఖుడు ఒకరు తెలిపారు. ఇలా ఎంపిక చేసుకుని, చానళ్లకు చెల్లింపులు జరిపితే, జేబు ఖర్చు కూడా అదుపులో ఉంటుంది. ఈ రకమైన మార్పు కొంత మేరకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది.

ఒక ప్యాకేజీలో చేరాలంటే చానల్‌కు గరిష్ఠంగా రూ.19 మాత్రమే వసూలు చేయాల్సి ఉంటుంది. ఇంతకుమించి కనుక చానల్‌ ధర నిర్ణయించుకుంటే, ఏ ప్యాకేజీలో భాగం అయ్యే వీలుండదు. ఆ చానల్‌ ప్రసారం చేసే ప్రసారాల (సొంత సామర్ధ్యం)పై విశ్వాసం ఉంటేనే ప్రత్యేకంగా ధర నిర్ణయించుకునే వీలుంటుంది.  

తెలుగు చానళ్లను చూస్తే వార్తా చానళ్లు ఉచితంగానే లభిస్తుండగా, ఈటీవీ రూ.17, మిగిలిన చానళ్లకు రూ.19గా ధర ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్‌ సిటీకేబుల్‌ ప్రధాన భాగస్వామి మాస్టర్‌ చానల్‌ ఎండీ పొట్లూరి సాయిబాబు ‘ఈనాడు’తో చెప్పారు. వినియోగదారులు కోరుకున్న చానళ్లు మాత్రమే చూడగలగడం నూతన విధానం ప్రత్యేకతగా ఆయన పేర్కొన్నారు. భాష/కంటెంట్‌ పరంగా చానళ్లను ప్యాకేజీలుగా చేస్తున్నామని, వీటి ధరలు డీటీహెచ్‌ ఆపరేటర్లకు అనుగుణంగా, 2-3 రోజుల్లో ప్రకటిస్తామని తెలిపారు.  కొత్త విధానంపై స్థానిక ఆపరేటర్లు ఇప్పటివరకు సరిగా ప్రచారం చేయడం లేదు. ఇకపై అయినా అవగాహన కల్పించాల్సి ఉంది.

 నూతన విధానానికి ఈనెల 29 కల్లా సిద్ధం కావాల్సి ఉందని హైదరాబాద్‌లోని సిటీ నెట్‌వర్క్‌ ఎండీ కంచర్ల శివరామకృష్ణ వెల్లడించారు. ప్రస్తుతం 400 చానళ్లు ప్రసారం చేస్తున్నా, నెలకు రూ.250 మాత్రమే వసూలు చేస్తున్నట్లు తెలిపారు. ఇకపై కుటుంబీకులు చర్చించుకుని, అవసరమైన చానళ్లకే చెల్లింపులు జరిపే పరిస్థితి వస్తుందన్నారు. డీటీహెచ్‌ తరహాలోనే కేబుల్‌ ఆపరేటర్‌కు కూడా ముందస్తు చెల్లింపులు జరిపితేనే ప్రసారాలుంటాయని, లేకపోతే, ప్రసారాలు నిలిచిపోతాయని స్పష్టం చేశారు. ప్రతి చానల్‌కు ఎంత వసూలు చేసేదీ, ఇప్పటికే ఆయా చానళ్ల లోగో పక్కన పైవరుసలో పొందుపరుస్తున్నట్లు తెలిపారు. దీనిపై వినియోగదార్లకు అవగాహన కల్పించమని స్థానిక ఆపరేటర్లకు సమాచారం ఇచ్చామన్నారు. డీటీహెచ్‌ ఆపరేటర్లు కూడా కొత్త ప్యాకేజీలు ప్రకటిస్తున్నారని, తాము కూడా అతి త్వరలోనే వెల్లడిస్తామన్నారు. మిగిలిన కేబుల్‌ ఆపరేటర్లు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారని పేర్కొన్నారు.