పవన్ కళ్యాణా.. నాకా.. తెలీదు.. తెలిసిన చెప్పను..!

జనసేన పార్టీ అధ్యక్షుడు,సినీ రంగంలో స్టార్ హీరోల్లో ఒకరు అయిన వ్యక్తి పవన్ కళ్యాణ్.గత ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమి తరఫున ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ ఎవరో తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే బాలకృష్ణకు తెలీదట.మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన పవన్ ఎవరో తనకు తెలియదనినందమూరి బాలకృష్ణ చెప్పడం ఆశ్చర్యం కలిగించింది.

ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఫిబ్రవరి 16 న జేఎఫ్ఎఫ్‌సీ ఏర్పాటుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నాడు.ఈ నేపథ్యంలో పవన్ పోరాటంపై మీ స్పందన ఏంటని వైజాగ్‌లో విలేకరులు బాలకృష్ణను ప్రశ్నించగా ‘పవన్ కళ్యాణా’ తను ఎవరో తెలీదంటూ ఘాటుగా బదులిచ్చాడు.వెంటనే కార్లో అక్కడి నుంచి వెళ్లిపోయాడు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

గతంలో పవన్,బాలయ్య ఇద్దరూ కలిసి ఫొటోలు దిగారు.సినీ ఇండస్ట్రీలో కూడా వీరు ఇరువురు స్టార్ హీరోలుగా పేరు గాంచారు.అలాంటిది బాలకృష్ణకు పవన్ కళ్యాణ్ తెలియకపోవడం విడ్డురంగా ఉంది.గత ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం పవన్ తన వంతు శ్రమించాడు.2014లో టీడీపీ అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణే కారణమని ఇటీవలే ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించాడు.అలాంటిది తమకు మిత్ర పక్షం లాంటి జనసేన నాయకుడు ఎవరో బాలయ్యకు తెలియకపోవడం విచిత్రం.

బాలయ్య వ్యాఖ్యల పట్ల పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నారు.వెళ్లి మీ బావ చంద్రబాబును అడిగితే చెబుతాడంటూ పంచ్‌లు వేస్తున్నారు.గతంలో కేంద్ర మంత్రి అశోక గజపతి రాజు కూడా పవన్ ఎవరో తెలీదనంటూ కామెంట్ చేసిన విషయం తెలిసిందే.