బాల‌య్యా.. టిక్కెట్ కావాల‌య్యా..!

balakrishna ,trendingandhra
తెలంగాణ‌లో ఎలెక్ష‌న్ వార్ సెగ‌లు క‌క్కుతుంది. మ‌హాకూట‌మిలో భాగ‌స్వామిగా ఉన్న టీడీపీ సీట్ల స‌ర్దుబాటు ఎపిసోడ్ ముగింపు కోసం ఎదురు చూస్తోంది. తెలంగాణ టీడీపీ నేత‌లు చంద్ర‌బాబు ఆదేశాల ప్ర‌కారం క‌చ్చితంగా గెలిచే సీట్ల‌నే డిమాండ్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ ఎన్నిక‌ల‌కు సంబంధించి ఎన్టీఆర్ త‌న అల్లుడికి ఒక ఆదేశం జారీ చేశార‌ట‌. క‌చ్చితంగా జ‌రిగి తీరాల‌న్నార‌ట‌.

అయితే, ఎన్టీఆర్ స్వ‌ర్గ‌స్థులై 23 ఏళ్లు అయింది. అలాంటిది ఆయ‌న త‌న అల్ఉడ్ని ఎలా ఆదేశిస్తారు..? అస‌లు శార‌ధి స్టుడియోలో ఏం జరిగింది..? శార‌థి స్టుడియోలోనే ఎన్టీఆర్ త‌న అల్లుడ్ని తెలంగాణ ఎన్నిక‌ల‌కు సంబంధించి ఆదేశించార‌న్న వార్త పార్టీలో జోరుగా సాగుతుంది. కానీ, అదెలా సాధ్యం.

ఇక అస‌లు విష‌యానికొస్తే, శారధి స్టుడియోలో ఎన్టీఆర్ బ‌యోపిక్ రెండు భాగాలకు సంబంధించి చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా సాగుతుంది. ఎన్టీఆర్ పాత్ర‌ను ఆయ‌న కుమారుడు బాల‌కృష్ణ పోషిస్తున్నాడు. షూటింగ్ జ‌రుగుతోంది. స‌రిగ్గా అదే స‌మ‌యంలో శార‌ధి స్టుడియోలోకి ఒక కారు వ‌చ్చింద‌ట‌. అందులోనుంచి దిగిన వ్య‌క్తి డైరెక్టుగా ఎన్టీఆర్ వేషంలో ఉన్న బాల‌య్య ద‌గ్గ‌ర‌కు వెళ్లార‌ట‌. తాను వ‌చ్చిన విష‌యం చెప్పార‌ట‌. మీ వ‌ల్లే ప‌ని అవుతుంద‌ని ప్రాధేయ‌ప‌డ్డార‌ట‌. ఆ త‌రువాత అక్క‌డికి టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఏపీ మంత్రి, బాల‌కృష్ణ అల్లుడు లోకేష్ వ‌చ్చార‌ట‌. త‌న అల్లుడు లోకేష్‌కు బాల‌కృష్ణ అస‌లు విష‌యం చెప్పార‌ట‌. ఎలా అయినా ఇది జ‌ర‌గాల్సిందేన‌ని అల్లుడు లోకేష్‌కు బాల‌కృష్ణ చెప్పార‌ట‌. బాల‌కృష్ణ త‌న అల్లుడ్ని ఆదేశించారు. ఆ స‌మ‌యంలో బాల‌కృష్ణ ఎన్టీఆర్ వేష‌ధార‌ణ‌లో ఉన్నారు కాబ‌ట్టి.. ఎన్టీఆర్ అల్లుడు చంద్ర‌బాబే టీడీపీ అధినేత కాబ‌ట్టి ఎన్టీఆరే త‌న అల్లుడ్ని ఆదేశించారంటూ టీడీపీ కార్య‌క‌ర్త‌లు గుస గుస‌లాడుకుంటున్నార‌ట‌.

ఇంత వ‌ర‌కు క్లారిటీ వ‌చ్చింది. కానీ, స్ప‌ష్ట‌త రావాల్సిన విష‌యం ఇంకా మిగిలే ఉంది. అస‌లు బాల‌కృష్ణ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన ఆ వ్య‌క్తి ఎవ‌రు..? ఆయ‌న‌కు తెలంగాణ ఎన్నిక‌ల‌కు సంబంధం ఏమిటి..? ఆయ‌న ఏ విష‌యంలో బాల‌కృష్ణ సాయం కోరారు. బాల‌కృష్ణ త‌న అల్లుడు లోకేష్‌ను ఏమ‌ని ఆదేశించారు..?

గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోని ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ టిక్కెట్ ఆశించిన ఆ పారిశ్రామిక‌వేత్త అందుకోసం శార‌ధి స్టుడియోలో బాల‌కృష్ణ‌ను క‌లిశార‌ట‌. శివారు ప్రాంతంలోని ఆ నియోజ‌క‌వ‌ర్గంలో ఆంధ్రా ఓట‌ర్ల సంఖ్య అధికంగా ఉంటుంది. భ‌వ్యంగా వ్యాపారం చేసుకుంటున్న ఆ పారిశ్రామిక వేత్త సినిమాల‌ను కూడా నిర్మించారు. భారీ వ‌సూళ్లను రాబ‌డుతుంద‌ని భావించి గ‌త ఏడాది.. ఆయ‌న నిర్మించిన చిత్రం వ‌సూళ్ల‌లో చేతులెత్తేసింద‌ట‌. నిర్మాణ పరంగా సంతృప్తిని ఇచ్చినా.. పైస‌ల వ‌సూళ్ల‌లో మాత్రం సంతృప్తి ఇవ్వ‌లేద‌ట‌. ఆ న‌ష్టం తాలూకు బాధ‌ను పోగొట్టి ఆయ‌న‌కు ఆనందం క‌లిగించ‌డానికి శివారు ప్రాంతంలోని నియోజ‌క‌వ‌ర్గ టిక్కెట్ ఇవ్వాల‌ని బాల‌కృష్ణ లోకేష్‌ను కోరార‌ట‌. నేను ప్ర‌చారానికి వెళ‌తాన‌ని, ఆ పారిశ్రామిక‌వేత్త‌ను గెలిపించుకునే బాధ్య‌త నాద‌ని బాల‌కృష్ణ లోకేష్‌కు స్ప‌ష్టం చేశార‌ట‌. మ‌రి ఆ పారిశ్రామిక‌వేత్త‌కు టీడీపీ టిక్కెట్ ద‌క్కుతుందా..? ఇంత‌కీ ఆ పారిశ్రామిక‌వేత్త ఎవ‌రు..? ఈ ప్ర‌శ్న‌ల‌న్నిటికీ అతి త్వ‌ర‌లోనే స‌మాధానం దొరుకుతుంద‌ని తెలుగు త‌మ్ముళ్లు చ‌ర్చించుకుంటున్నార‌ట‌.