సెటిలర్స్ జై కొట్టేది ఆ పార్టీకేనా ?

 

is the Party of the Settlers Jai Trending Andhra

తెలంగాణ ఎన్నికల్లో ఆంధ్రా సెటిలర్లు ఎటువైపు? గుర్తొచ్చినప్పుడల్లా ఆంధ్రోళ్లు అని నానా దుర్భాషలాడుతున్న టీఆర్ఎస్ వైపా లేకా గత ఎమ్మెల్యే ఎన్నికల్లో అభిమానించి ఓటేసిన టీడీపీ వైపా అనేది కాస్త ఆలోచించాల్సిన పశ్నే. ఈ ప్రశ్న అన్ని రాజకీయ పార్టీలతో పాటు రాజకీయ విశ్లేషకులను కూడా ప్రస్తుతం వేధిస్తోంది. వచ్చే ఎన్నికల్లో సెటిలర్స్ పై శ్రద్ధ పెట్టిన కేటీఆర్ వ్యాఖ్యలు ఒకవైపు, మరోపక్క జగన్ కు మద్దతుగా టీఆర్ఎస్ ఉందనే సంకేతాలు ఒకవైపు ఉన్న నేపధ్యంలో సెటిలర్స్ నిర్ణయం ఏమై వుంటుందో అన్నది ఇప్పుడు తెలంగాణా రాజకీయాల్లో హాట్ టాపిక్ .
గ్రేటర్ హైదరాబాద్‌లో ఆంధ్రా సెటిలర్స్ చాలా మంది ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న ఏడెనిమిది నియోజకవర్గాల్లో సీమాంధ్రుల ఓట్ బ్యాంక్ బలంగా ఉంది.నిర్ణయాత్మక ఓటు బ్యాంక్ ఉన్న కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, సనత్ నగర్, జూబ్లిహిల్స్, ఖైరతాబాద్, ఎల్బీ నగర్, పటాన్‌చెరు, కుత్బుల్లాపూర్, ఇబ్రహీంపట్నం‌లాంటి నియోజకవర్గాల్లో ఆ ఓటు బ్యాంకు ప్రభావం చూపొచ్చని అంచనా వేస్తున్నారు. పాతబస్తీలోని ఏడు నియోజకవర్గాలు మినహాయిస్తే హైదరాబాద్, దాని చుట్టుపక్కల నియోజకవర్గాలు కచ్చితంగా కీలకం కాబట్టే మంత్రి కేటీఆర్ సీమాంధ్రుల ఓట్ల మీద కన్నేశారు. ఆంధ్రులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గత నాలుగేళ్లుగా కంటికి రెప్పలా కాపాడుకున్నట్టే భవిష్యత్తులోనూ ఉంటామని చెప్పారు. ఒకవేళ ఏదైనా మాట్లాడితే రాజకీయంగా చూడాలే కానీ తప్పుగా అర్ధం చేసుకోవద్దని బ్రతిమాలుతున్నారు.
కేటీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ మాజీ ఎంపీ మధు యాష్కీ కౌంటర్ ఇచ్చారు. గతంలో ఆంధ్రులను తిట్టి, ఆంధ్రా విద్యార్థులకు లబ్ధి జరగకుండా ఫాస్ట్ పథకాన్ని తీసుకొచ్చిన వారు ఇప్పుడు సీమాంధ్రులను కాకాపట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.2014 ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గంలోనే టీఆర్ఎస్ విజయం సాధించింది. టీడీపీ తొమ్మిది నియోజకవర్గాల్లో గెలుపొందింది. కానీ, వారిలో ఆర్.క‌ృష్ణయ్య మినహా మిగిలిన వారు టీఆర్ఎస్‌ జెండా పట్టుకున్నారు. ఆ తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సీన్ కారుకు అనుకూలంగా మారటంతో మొత్తం 150 డివిజన్లలో 99 చోట్ల టీఆర్ఎస్ గెలుపొందింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ ఏం చేస్తుందనే అభిప్రాయంతోనే అప్పుడు ఆంధ్రా ఓటర్లు గులాబీ పార్టీకి జైకొట్టారు. అంతే కాక టీడీపీలో నాయకుల జంప్ కూడా ఒక కారణం .
కానీ అనూహ్యంగా మహాకూటమి పొత్తులతో ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ ఇక్కడ కూడా ఎన్నికల బరిలోకి దిగుతుంది. ఈ నేపధ్యంలో టీఆర్ఎస్ టీడీపీ పై మాటల దాడి చేస్తూనే జగన్ కు మద్దతు ఇస్తున్నట్టు తాజాగా జరిగిన జగన్ పై దాడి వ్యవహారంతో తెలుస్తుంది.సెటిలర్స్ ప్రభావం ఉన్న చోట ఓటు బ్యాంకును చీల్చే యత్నం కూడా చేస్తుంది టీఆర్ఎస్. ఇన్ని రాజకీయ పరిణామాలతో ఊహించని ట్విస్ట్ లతో ఎన్నికల్లో సెటిలర్స్ ను ప్రసన్నం చేసుకోవాలని చూస్తునాయి పార్టీలు . మరి సెటిలర్స్ ఏ పార్టీ కి జై అంటారో త్వరలోనే తేలనుంది.