కళాతపస్వికి జన్మదిన శుభాకాంక్షలు………!

విశ్వనాథ గారు దర్శకుడిగా,ఆర్టిస్ట్ గా అయన ఎంతో అభినయాన్ని పలికించిన విషయం తెలిసిందే.దర్శకుడిగా అయన ఎన్నో గొప్ప చిత్రాలను తెరకేకించిన విషయం తెలిసిందే.కమర్షియల్ మూవీస్ రాజ్యమేలుతున్న ఈ కాలంలో కళాత్మక సినిమాలు తీసి, విజయం సాధించడం మామూలు సంగతి కాదు.

అటువంటి నిరంతర కార్యసాధకుడు కాశీనాథుని విశ్వనాథ్. కళాత్మక చిత్రాలు తీయాలంటే గుండెల్లో తపన ఉండాలి. అభిరుచిని గుర్తించి వెన్ను తట్టే నిర్మాత ఉండాలి. ఈ రెండూ ఉన్న అదృష్టవంతుడు కళాతపస్వి కె. విశ్వనాథ్.

విశ్వనాథ్ కళాత్మక చిత్రాలు మాత్రమే తీయలేదు. శారద, కాలంమారింది, చెల్లెలి కాపురం, ఉండమ్మా బొట్టు పెడతా, మాంగల్యానికి మరో ముడి సూత్రధారులు, ఆపద్భాంధవుడు, స్వయంకృషి వంటి సందేశాత్మక సినిమాలూ తీశారు. ఆత్మగౌరవం, నేరము-శిక్ష, ఓ సీత కథ, సీతామాలక్ష్మి, శుభోదయం వంటి అభ్యుదయ దృక్పథం ఉన్న సినిమాలూ తీశారు.

విశ్వనాథ్ సినిమా అంటే దేశంలో ఎంతో మందికి ఎంతో గౌరవం ఉంది. ఏదో తీశామంటే తీశామని సినిమా చుట్టేసే ఆలోచన ఆయనకు అసలు లేదు.కళ అజరామరమైంది. ఆ కళకు జీవమిచ్చి, జీవితాన్నివ్వాలి. తరతరాలుగా కొనసాగేలా చేయాలి. కె. విశ్వనాథ్ ఆ పని చేసి తన జీవితాన్ని సార్థకం చేసుకున్న ధన్యజీవి.

సాహిత్యం, సంగీతం, నాట్యం ఈ మూడు కళల అద్భుత సంగమాలు కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్ కమనీయ దృశ్య కళాకావ్యాలు. ఆయన తీసిన ప్రతి చిత్రంలోనూ కళాత్మకత ఉంటుంది. కళా రమణీయత ఉంటుంది. నేడు ఆ కళా దర్శకుడి పుట్టిన రోజు.