రంగంలోకి లోకనాయకుడు కమల్ !

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చనిపోయినప్పటినుండి తమిళ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగు తున్నాయి. అమ్మ పార్టీగా పిలవబడే అన్నాడీఎంకే లో ఆధిపత్య పోరు లో పార్టీ మూడు భాగాలుగా విడిపోయింది. దివంగత నేత జయలలిత కు ఆప్తుడైన పన్నీర్ సెల్వం మొదట గా పార్టీ నుండి బయటకు వచ్చి పార్టీ లోని వారి ఫై తీవ్రమైన వ్యాఖ్యలు చేసారు.
 
అన్నాడీఎంకే లో అధ్యక్ష పదవి కోసం పోరాడి తీరా దక్కుతుంది అనే టైం లో కోర్ట్ కేసు కారణం గా శశికళ జైల్లో శిక్షను అనుభవిస్తుంది. ఈ కారణాల వల్ల తమిళ రాజకీయం అంతుపట్టకుండా పోతుంది. ఈ తరుణం లో తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ రాజకీయ అఱంగెట్రం చేస్తున్నారు ప్రకటించాడు.
 
రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న కమల్‌హాసన్‌ బుధవారం ఉదయం రామేశ్వరంలోని మాజీ రాష్ట్ర పతి అబ్దుల్‌ కలాం సమాధిని దర్శించుకున్నారు. కలాం సమాధికి అంజలి ఘటించారు. అబ్దుల్‌ కలాం ఇంటికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను కలిశారు. అనంతరం అక్కడి నుంచి మదురై బయలుదేరారు. మదురైలో నిర్వహించనున్న భారీ బహిరంగసభలో కమల్‌ తన రాజకీయపార్టీ పేరును ప్రకటించి పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.
 
సాయంత్రం మదురైలో నిర్వహించనున్న బహిరంగ సభలో పార్టీ పేరు, పతాకం, పార్టీ లక్ష్యాలను కమల్‌ ప్రకటిస్తారు. పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తోపాటు పలువురు నేతలు హాజరుకానున్నారు. పార్టీ ఏర్పాట్ల సన్నాహాల్లో భాగంగా ఇటీవల పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కేరళ సీఎం విజయన్‌లను, డీఎంకే నేతలు కరుణానిధి, స్టాలిన్‌లతోపాటు రజనీకాంత్, విజయ్‌కాంత్‌లను కమల్‌ కలుసుకున్నారు.తమిళ ప్రజలు మాత్రం మాకు సరైన న్యాయం చేసే నాయకుడి కోసం ఎదురు చూస్తున్నట్టు చెపుతున్నారు.