అక్కడనుంచే పోటీ చేస్తానంటున్న కెసిఆర్..!

తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహాలు,ప్ర‌తివ్యూహాలు ఎవ్వ‌రికి అంతు ప‌ట్ట‌వు.ఎత్తులు వేయ‌డంలోనూ,విప‌క్షాల ఎత్తుల‌ను చిత్తు చేయ‌డంలోనూ ఆయ‌న‌కు ఆయ‌నే సాటి.వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి విజ‌యం సాధిస్తామ‌న్న ధీమాతో ఎవ్వ‌రికి అంద‌కుండా దూసుకుపోతోన్న కేసీఆర్ నియోజ‌క‌వ‌ర్గం మారుతున్నారా అంటే తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో అవున‌న్న సమాధానాలే వినిపిస్తున్నాయి.కేసీఆర్ ప్ర‌స్తుతం ప్రాథినిత్యం వ‌హిస్తోన్న గ‌జ్వేల్‌ను విడిచిపెట్టి ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తారు ఇదే ప్ర‌శ్న ప్ర‌స్తుతం రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.కేసీఆర్ గ‌త ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా నియోజ‌క‌వ‌ర్గాలు మారుతూ వ‌స్తున్నారు.2004లో సిద్ధిపేట ఎమ్మెల్యేగా,క‌రీంన‌గ‌ర్ ఎంపీగా పోటీ చేసిన ఆయ‌న 2009లో మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎంపీగా పోటీ చేశారు.ఇక 2014లో గ‌జ్వేల్ ఎమ్మెల్యేగాను,మెద‌క్ ఎంపీగాను పోటీ చేశారు.దీనిని బ‌ట్టి ఆయ‌న మ‌రోసారి నియోజ‌క‌వ‌ర్గం మారే అవకాశం ఉంద‌ని పార్టీలోనే చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.ఇక గ‌తేడాది జ‌రిగిన జిల్లాల పున‌ర్విభ‌జ‌న అనంత‌రం సీఎం కేసీఆర్ సొంత నియోజ‌క‌వ‌ర్గం ముక్క‌లై పోవ‌డంతో రాబోయే ఎన్నిక‌ల్లో ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గం మార‌తార‌ని అంటున్నారు.

ప్ర‌తి ఎన్నిక‌కు నియోజ‌క‌వ‌ర్గం మార‌డం ఆయ‌న‌కు ఓ సెంటిమెంట్ అయితే కేసీఆర్‌ గజ్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఇప్ప‌టి వ‌ర‌కు మెదక్‌ జిల్లాలో ఉండేది.విభజన తర్వాత ఇది కొత్తగా ఏర్పడ్డ సిద్ధిపేటలో ఉంది.ఈ నియోజకవర్గంలో గజ్వేల్‌,తుఫ్రాన్‌,కొండపాక,వర్గల్‌,ములుగు,జగదేవ్‌పూర్‌ మండలాలు ఉండగా,ఇందులో తుఫ్రాన్‌ మినహా మిగిలిన ఐదు మండలాలను సిద్ధిపేట జిల్లాలో చేర్చారు.తుఫ్రాన్‌ మండలం మాత్రం మెదక్‌ జిల్లాలోనే ఉంది.

ఇక ఇప్పుడు సీఎం హోదాలో కేసీఆర్ కూడా రెండు జిల్లాల‌కు ఎమ్మెల్యేగా ఉన్నారు.ఇక పార్టీ బ‌లంగా ఉన్న మెద‌క్‌,సిద్ధిపేట ప్రాంతాల్లో కాకుండా ఆలేరు లాంటి చోట్ల పోటీ చేస్తే ఆ ప్రభావం పాత న‌ల్గొండ జిల్లాపై బ‌లంగా ఉంటుంద‌ని,దీంతో అక్క‌డ బ‌లంగా ఉన్న కాంగ్రెస్‌ను దెబ్బ‌కొట్ట‌డంతో పాటు తాను ఎంపీగా పోటీ చేస్తాన‌ని చెపుతోన్న కోమ‌టిరెడ్డి,జానా,ఉత్త‌మ్‌రెడ్డి లాంటి వాళ్ల‌ను ఓడించ‌డం లేదా వారికి చెమ‌ట‌లు ప‌ట్టించాల‌న్న‌దే కేసీఆర్ లక్ష్యంగా తెలుస్తోంది.