ఏపీకి నిధులు రావాలంటే ఇలా చేయండి !

తనదైన శైలితో వ్యాఖ్యలు చేసే గుడివాడ వైసిపి ఎంఎల్ఏ కొడాలినాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎపికి నిధులు రావాలంటే ఒకే ఒక పరిష్కార మార్గం ఉందని…అది తెలుగుదేశంపార్టీని బిజెపిలో వెంటనే విలీనం చేసేయడమేనని కొడాలి నాని వ్యంగ్యాస్త్రాలు చేశారు. నాని చేసిన ఈ వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. ప్రత్యేకహోదాపై బుధవారం విజయవాడలో జరుగుతున్న ఓ చర్చా వేదికలో పాల్గొన్న నాని రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇదే సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురించి కొడాలి నాని చేసిన మరి కొన్ని వ్యాఖ్యలు కూడా తీవ్ర కలకలం రేపుతున్నాయి. చంద్రబాబు “ఓటు కు నోటు” కేసులో దొరికిపోయిన తరువాత కేంద్రం చేతిలో కీలుబొమ్మలాగ తయారైపోయాడని కొడాలి నాని ఆరోపించారు. ఆ కేసు వల్లే చంద్రబాబు కేంద్రంతో గట్టిగా పోరాడటం కాదు…గట్టిగా మాట్లాడలేక పోతున్నాడని ఎద్దేవా చేశారు. కేసులకు భయపడి ప్రత్యేక హోదా అంశాన్ని తాకట్టుపెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు కొత్తనాటకాలు మొదలుపెట్టారని విమర్శించారు.
‘కుట్రలు, కుతంత్రాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టినవిద్య. ఆయన చెప్పేదొకటి, చేసేదొకటి. ప్రత్యేక హోదా సాధన దిశగా వైఎస్‌ జగన్‌ చేసిన ప్రకటనతో చంద్రబాబుకు దిమ్మతిరిగింది. ఏం చెయ్యాలో అర్థంకాని స్థితితో తన పార్ట్‌నర్‌ పవన్‌ కల్యాణ్‌ను తెరపైకి రప్పించారు. రకరకాల ప్రకటనలు చేయిస్తూ ప్రజలను గందరగోళంలోకి నెట్టాలని చూస్తున్నారు. బాబుకు కావాల్సిందల్లా అధికారం. అందుకోసం ఆయన ఎంతకైనా దిగజారుతారనే చరిత్ర ఉండనేఉంది. వీళ్ల కుట్రలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్‌కు పట్టినగతే తెలుగుదేశం, బీజేపీలకూ తప్పదు’’ అని కొడాలి నాని అన్నారు.