నాగ పంచమి విశేషాలు …!

నాగేంద్రుడు శివ్ఞడికి హారమైతే, కేశవ్ఞడికి తల్పమయ్యాడు. హైందవ సంప్రదాయంలోనే గాక జైన, బౌద్ధ ధర్మాల్లోనూ నాగారాధనకు ప్రాముఖ్యం ఉంది. ధ్యానముద్రలో ఉన్న జినుడు, బుద్ధుల శీర్షాలపై ఫణీంద్రుడు పడగవిప్పి ఉన్న ప్రతిమలు అనేకచోట్ల లభించాయి. మొహంజొదారో శిథిలాల్లో, అథఃకాయం నాగం, ఊర్థ్వకాయం మానవం గల నాగచిత్రాల ముద్రలు, యోగి పక్కన పడగ ఎత్తి ఆడుతున్న సర్పాల ముద్రలు లభ్యమయ్యాయి. సర్పపూజ మొదట అనార్య సంస్కృతి చిహ్నంగా ఉండి, తరువాత వైదిక ముద్ర పొందినట్లు గోచరిస్తోంది.

నాగపూజా వైశిష్ట్యాన్ని గురించి అనేక కథలు వ్యాప్తిలో ఉన్నాయి. ఒక విప్రునికి ఏడుగురు కోడళ్లు, కట్టకడపటి కోడలు తప్ప మిగిలిన వారందరూ ఒకసారి పుట్టినింటికి వెళ్లారు. కడపటి కోడలికి తల్లిదండ్రులు లేరు. తక్కిన వారందరు తమతమ పుట్టినింటికి వెళ్లారు. కట్టకడపటి కోడలు మాత్రం మామగారి ఇంటనే ఉండి తనకు ఆదిశేషుడు తప్ప వేనే తండ్రి లేడని విచారముతో చెప్పుకొనుచుండెను. ఆదిశేషుడు కరుణించి వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి ఆమె మామగారితో తాను ఆమెకు మేనమామనని చెప్పి ఒప్పించి పుట్టినింటికి తీసుకువెళ్తానని పలికాడు. అత్తగారి ఆరడితో విసిగి వేసారిన కోడలు కూడా సమ్మతించి బయలుదేరింది. కొంతదూరము వెళ్లిన పిమ్మట మాయా బ్రాహ్మణుడు తన నిజరూపము దాల్చి తన ఫణముపై ఆవిడను స్వారీచేయమని ఆదేశించి నాగలోకమునకు తీసుకుని పోయి తన భార్యాపిల్లలతో ఉండమనెను. నాగజాతి యావత్తూ ఆమెను గౌరవించేది.

కొంతకాలానికి ఆదిశేషుని భార్య ప్రసవించెను. ఇంటినిండా పాము పిల్లలు పాకుచుండెను. ఒకసారి ఆమె బరువైన ఇత్తడి దీపాన్ని పట్టుకొని వస్తుండగా దారికడ్డంగా తిరుగుతున్న పాము పిల్లలను చూసి దీపాన్ని జారవిడువగా వాటి తోకలు తెగిపోయి గాయాలయ్యాయి. కొంతకాలానికి ఆదిశేషుడు ఆమెను అత్తవారింటికి పంపివేశాడు. వికలాంగులైన సర్పాలు తమ ఆ స్థితికి కారణం తెలుసుకొని ఆమెను కాటువేయడానికి భూలోకం వచ్చాయి. కాని శ్రావణ శుద్ధ పంచమి నాడు ఆమె వికలాంగులైన సర్పాలను రక్షించమని దైవప్రార్థన చేయడం, నాగప్రతిమలను పూజించ డం చూశాక దుష్టచింతన విరమించాయి. నైవేద్యానికి ఉంచిన పాలను ఆరగించి, ఆ గిన్నెలో రత్నహారమొకటి విడిచి వెనుదిరిగాయని కథ. ఆరోజు నుంచి నాగులపంచమి రోజున నాగపూజను చేయడం ఆచారంగా మారింది. పాములు పంటలను అభివృద్ధి చేస్తాయని, పుత్రసంతానం ప్రసాదిస్తాయని ప్రజల విశ్వాసం. సర్పాలు భూమిలోని నిధి నిక్షేపాలకు కాపలాదార్లనే భావన కూడా ఉంది. నాగదేవత వర్షదేవత అని మరో నమ్మకం. నాగపంచమి కేవలం సర్పముల పూజా నిమిత్తమై యేర్పడినట్టిది.

నాగపంచమినాడు జనులు శిరస్నానము చేసి ప్రాతఃకాలముననే సర్పముల ప్రతిమలకు పాలు, కొబ్బెర, అన్నము ఆరగింపు చేస్తారు. మరికొందరు మట్టితో చేయబడ్డ పామునిగాని, బంగారం గాని, వెండిది కాని, కట్టెది కాని, లేకపోతే గోడ మీద పసుపుతో కానీ మంచిగంధంతో కానీ ఐదు లేదా ఏడు లేదా తొమ్మిది పాముల్ని చిత్రించి మొదట పుష్పాలతో అలంకరించి పిండి, పాలు, పానకం, వడపప్పు, పిండివంటలను నాగేంద్రునకు నైవేద్యంగా సమర్పిస్తారు.