బీజేపీకి నాగం గుడ్ బై… ఆ పార్టీ లోకి జంప్ !

మాజీ తెలుగుదేశం పార్టీ తెలంగాణా నేత, ఆపై మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీలో చేరి, అక్కడా ఇమడలేకపోయిన నాగం జనార్దన్ రెడ్డి ఇప్పుడు మరో పార్టీ వైపు చూస్తునట్టు సమాచారం.

ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. రెండు రోజుల క్రితమే ఆయన తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలసి రాహుల్ గాంధీని కలసి వచ్చారని, నాగం చేరికను రాహుల్ సైతం స్వాగతించారని కాంగ్రెస్ వర్గాల సమాచారం.

ఉస్మానియా మెడికల్‌ కళాశాల నుంచి వైద్యవిద్యలో పట్టా పొందిన నాగం, తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ లో ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన చరిత్రను ఆయన సొంతం చేసుకున్నారు. చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రిగానూ విధులు నిర్వహించారు. 2013లో ఆయన బీజేపీలో చేరారు. ఇక నాగం కాంగ్రెస్ లో చేరికతో మహబూబ్ నగర్ జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు.