‘అ!’.. మూడు రోజుల్లో అంత కలెక్షనా ?

నేచురల్ స్టార్ నాని నిర్మించిన విలక్షణ, వైవిధ్యభరిత సినిమా ‘అ!’. ఇప్పటి వరకు తెలుగులో ఇలాంటి సినిమా రాలేదు అనడంలో అతిశయోక్తి కాదు.

కాన్సెప్టే చాలా కొత్తగా ఉంది. చాలా బాగుంది అని కొందరు అంటే.. మరికొంత మంది అసలు అర్థం కాలేదు ఇదేం సినిమా అని అన్నారు. దీంతో ఈ ప్రభావం సినిమా వసూళ్లపై పడుతుందేమో అని భావించారు అంతా. కాని అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బాక్సాఫీసు వద్ద ‘అ!’ దూసుకుపోతోంది.

తొలి మూడు రోజుల్లో ‘అ!’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.9.4 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. దీనిలో డిస్ట్రిబ్యూటర్ల షేర్ రూ.4.5 కోట్లు. ఆంధ్రా, నైజాంలో కలిపి మూడు రోజుల్లో రూ.2.5 కోట్ల షేర్ వసూలైంది. కర్ణాటకలో రూ.35 లక్షలు, ఇతర ప్రాంతాల్లో రూ.15 లక్షల షేర్ వచ్చింది. అటు అమెరికా బాక్సాఫీసు వద్ద ‘అ!’ సత్తా చాటుతోంది. ఫిబ్రవరి 15న ప్రీమియర్ షోలతో పాటు మూడు రోజుల్లో రూ.1.5 కోట్లు వసూలైంది.

యూఎస్‌లో ఇంకా థియేటర్లు పెంచుతున్నట్లు అక్కడి థియేట్రికల్ హక్కులు సొంతం చేసుకున్న నిర్వాణ సినిమాస్ ప్రకటించింది. ఈ మేరకు ట్వీట్ కూడా చేసింది. అంటే యూఎస్‌లో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం యూఎస్‌‌లో గ్రాస్ వసూళ్లు 5 లక్షల డాలర్లు (సుమారు రూ.3.22 కోట్లు) దాటింది. ఇక తరవాతి లక్ష్యం 10 లక్షల డాలర్లు (సుమారు రూ.6.44 కోట్లు) అని నిర్వాణ సినిమా వెల్లడించింది.