జనసేనాదిపతి పవన్ కళ్యాణ్ మౌనానికి కారణం అదేనా ?

ఈ ఏడాది కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగిన సంగతి తెలిసిందే.

ఈ గురువారం బడ్జెట్ ప్రవేశపెట్టిన దగ్గర నుండి ఒక్క బిజెపి తప్ప టిడిపి, వైసిపితో పాటు ఎపిలో పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పక్షాలు మండిపోతున్నాయి. వైసిపి, వామపక్షాలు అయితే రాష్ట్రంలోని పలుచోట్ల ప్రత్యక్ష ఆందోళనలకు సైతం దిగాయి. టిడిపి మంత్రులు, ఎంపిలు, నేతలు కూడా చంద్రబాబునాయుడుపై పొత్తులు వద్దంటూ తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే ఆంధ్రా మొత్తం బడ్జెట్ మీద మండి పడుతూంటే ఇటువంటి పరిస్ధితుల్లో స్పందించని అతి ముఖ్యమైన…ఏకైక వ్యక్తి…పవన్ కళ్యాణ్ మాత్రమే. తాను ప్రశ్నించటానికే పార్టీ పెట్టానంటూ జనసేన గురించి చెప్పేపవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ సమయంలో ఎక్కడా కనిపించకపోవడం పై సోషల్ మీడియాలో సెటైర్లు మీద సెటైర్లు వైరల్ అవుతున్నాయి.

అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించడానికే తాను రాజకీయాల్లోకి వచ్చానని, పార్టీ పెట్టానని చెప్పే పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఎన్ డిఎ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు అన్యాయంపై ఇంత కలకలం చెలరేగుతుంటే జనసేన అధినేత కనీసం స్పందించకపోవడం ఏంటి?… ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఇంతరగడ జరుగుతుంటే, పార్టీలకు అతీతంగా అందరూ బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై మండిపడుతుంటే…ఇటీవలే రాజకీయ యాత్రలు కూడా చేసొచ్చి…ఇక పై యాక్టివ్ అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ రోజుల వ్యవధిలోనే ఇంత పెద్ద విషయం పై ఇలా సైలెంట్ గా ఉండిపోవడం ఏంటి?…ఇలా..ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఈ ప్రశ్నలన్నీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

అయితే బడ్జెట్ లో అన్యాయం పట్ల ఆంధ్రా లో ప్రజలందరి మనో భావాలు ఒకే తీరుగా ఉండటంతో ఈ విషయంలో పవన్ వెంటనే స్పందించకుంటే ఇమేజ్ చాలా డామేజ్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది…కేంద్ర బడ్జెట్లో ఎపికి జరిగిన అన్యాయంపై స్పందించాల్సిన బాధ్యత పవన్ కు ఉందని, కారణం గతంలో టిడిపి, బిజెపి పొత్తును ముందుండి బలపర్చి ప్రచారం చేసిన విషయం ఎవరూ మర్చాపోలేదని అంటున్నారు. ఒకవేళ మళ్లీ రేపటి ఎన్నికల్లో బిజెపితో పొత్తు పెట్టుకోవాల్సి ఉంటుందని ఆలోచించి పవన్ కళ్యాణ్ సైలెంట్ అయ్యారా? లేక బడ్జెట్లో అసలు ఎపికి అన్యాయం జరిగినట్లు భావించడం లేదా? లేక అసలు బడ్జెట్ విడుదల విషయం ఇంకా తెలియలేదా?…లేదు అసలు ఇవన్నీ కాదు…నాకు కేంద్ర బడ్జెట్ మీద స్పందించేంత అవగాహన లేదు అని అంటారా?…

ఇలా ఏ కారణంతో ఆయన స్పందించడం లేదో ప్రజలకు జవాబు చెప్పాలని నెటిజన్లు వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు. ఒకవేళ బడ్జెట్ విడుదల విషయం తెలియకపోతే తరువాత వచ్చాక అయినా అదే విషయం అంగీకరించమని ఎద్దేవా చేస్తున్నారు…ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్లో కేంద్రం ఏపికి ఇంత అన్యాయం చేసిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడక సరికాదని…ఇలాగైతే…వచ్చే ఎన్నికల్లో ప్రజలెవరూ జనసేనను నమ్మరని అటు నెటిజన్లే కాదు ఇటు రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికయినా పవన్ దీని పై స్పందించక పోతే నష్టం అంచనా వేయడం కూడా కష్టం.