ఎన్నికల సమయం లో తెలంగాణలో భారీగా పట్టుబడుతున్న కరెన్సీ……!

మరో నెలన్నరలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ, పోలీసులు చేస్తున్న తనిఖీల్లో లెక్కల్లోకి రాని డబ్బు లక్షలకొద్దీ పట్టుబడుతోంది. సరైన పత్రాలు, రసీదులు లేకుండా తీసుకెళుతున్న డబ్బును పోలీసులు భారీగా పట్టుకుంటున్నారు. గత రాత్రి హైదరాబాద్ పరిధిలోని మూడు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేయగా, సుమారు రూ. 75 లక్షలు పట్టుబడ్డాయి.

సాయినాథ్ గంజ్ ప్రాంతంలోని ఎంజే వంతెన వద్ద, ఓ కారులో తీసుకెళుతున్న రూ. 60 లక్షలను పోలీసులు పట్టుకున్నారు. ఈ డబ్బును వ్యాపారం నిమిత్తం తీసుకెళుతున్నామని చెప్పినప్పటికీ, అందుకు తగిన ఆధారాలను చూపించలేదని, దీంతో డబ్బును ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగించామని ఏసీపీ నరేందర్ రెడ్డి తెలిపారు.

జూబ్లీహిల్స్ లో రామచంద్రరావు అనే వ్యక్తి వద్ద నుంచి రూ. 4.85 లక్షలను స్వాధీనం చేసుకున్నామని, డబ్బుకు తగిన ఆధారాలు, లెక్కలు చూపితే తిరిగి ఇస్తామని చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు. మరో ప్రాంతంలో తివారీ అనే వ్యక్తి, ఎటువంటి పత్రాలు లేకుండా రూ. 9.97 లక్షల నగదును తీసుకెళుతుండగా, గుర్తించిన పోలీసులు, దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు సాగుతుండగా, పలు ప్రాంతాల్లో లక్షల కొద్దీ దొరుకుతోంది. డబ్బు తరలింపులో అన్ని పార్టీల నేతలూ ఉన్నారని తెలుస్తోంది. ఇటీవల టీడీపీ యువనేత అనిల్ కుమార్ కారులో రూ. 60 లక్షలు దొరికిన సంగతి తెలిసిందే.