కూటమికి మరో షాక్… పొలిటికల్ స్టాక్ ఎక్స్చేంజ్ సర్వేలో టీఆర్ఎస్ దే పై చెయ్యి

political stock exchange survey results about KCR,trendingandhra

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు జాతీయ మీడియా నుంచి అనూహ్య సానుకూల పవనాలు వీస్తున్నాయి. టీఆర్ఎస్ మరోసారి విజయం దిశగా అడుగులు వేస్తున్నదని ప్రముఖ ఆంగ్ల టీవీ చానల్ ఎన్డీటీవీ తాజాగా పేర్కొనగా అదే విషయాన్ని మరో ఆంగ్ల చానల్ ఇండియా టుడే కూడా ధృవీకరించింది.. ఇక ఈ ఎన్నికల్లో మహాకూటమి ప్రభావం ఏమాత్రం ఉండబోదని తాజాగా విడుదలైన పొలిటికల్ స్టాక్ ఎక్సేంజ్ (పీఎస్ఈ) సర్వే పేర్కొంది. రాష్ట్రంలోని సగం మందికి పైగా ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల ఆదరణ చూపుతున్నారని వెల్లడించింది. గత నెల రోజుల వ్యవధిలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలలో మరో నాలుగు శాతం మద్దతు పెరిగిందని తెలిపింది. నెలరోజుల క్రితం తాము సర్వే జరిపినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి 44 శాతం మంది ప్రజలు మద్దతు తెలిపారని తాజాగా వారి సంఖ్య 48 శాతానికి పెరిగిందని వెల్లడించింది. ప్రభుత్వంపై తమ అభిప్రాయాన్ని వెల్లడించేందుకు ఎక్కువ మంది ముందుకు రావడం విశేషమని పేర్కొంది.
తెలంగాణలోని 17 పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలో 6877 మందిని ప్రశ్నించి సర్వే నివేదికను రూపొందంచినట్టు పీఎస్ఈ తెలిపింది. ఈ గణాంకాల ప్రకారం గత నెలలో ప్రభుత్వంపై ఎటువంటి అభిప్రాయం వ్యక్తంచేయని వారి సంఖ్య 22 శాతం కాగా ఇప్పుడు వారి సంఖ్య 14 శాతానికి తగ్గింది. ఉత్తర తెలంగాణలో టీఆర్ఎస్ అత్యంత బలమైన శక్తిగా ఉన్నదని కాంగ్రెస్ ప్రభావం దక్షిణ తెలంగాణలో మాత్రమే ఉందని పేర్కొంది. ఇక తెలుగుదేశం ప్రభావం ఖమ్మం రంగారెడ్డి జిల్లాలకే పరిమితమని తెలిపింది. హైదరాబాద్లోని మురికివాడలు పేదలు నివసించే ప్రాంతాల్లో సైతం టీఆర్ఎస్ బలమైన శక్తిగా ఉందని పీఎస్ఈ పేర్కొంది. టీఆర్ఎస్ కు మద్దతుగా ఉన్న ఎంఐఎం హైదరాబాద్ పాతబస్తీలో బలంగా ఉందని తెలిపింది. రాష్ట్రంలోని దాదాపు అన్ని స్థానాలకు పోటీ చేస్తున్న బీజేపీ కేవలం పట్టణ ఓటర్లపైనే ఆశలు పెట్టుకుందని పీఎస్ఈ సర్వే పేర్కొంది. ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు రైతు బీమాతోపాటు పలు పథకాలు అత్యధికమంది ప్రజలకు లబ్ధి చేకూర్చాయని వెల్లడించింది. దీంతో మళ్ళీ సీఎం కేసీఆర్ అని తాజాగా మరో సర్వే వెల్లడించటం కూటమి శ్రేణులకు మింగుడు పడటం లేదు.