వైసీపీ కి వంగవీటి గుడ్ బై…..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ లో మరోసారి అసమ్మతి సెగలు బయపడ్డాయి . ఏపీ రాజకీయాల్లో ఎంతో కీలకంగా ఉండే కృష్ణా జిల్లాలో మరో రాజకీయం వేడెక్కింది . వైసీపీకి వంగవీటి శ్రీనివాస ప్రసాద్ రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన జనసేనలో చేరుతారని రాజకీయ విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం అందుతుంది .

దీనికి గల ముఖ్య కారణం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సీటును వంగవీటి రాధాకు కేటాయించకుండా.. మల్లాది విష్ణుకు కేటాయించారంటూ ప్రచారం జరగడంతో ఒక్కసారిగా విభేధాలు భగ్గుమన్నాయి. ప్రస్తుతం వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై రాధా అనుచరులు, అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ప్రజలే జగన్‌కు తగిన బుద్ధి చెబుతారని జగన్ పై విమర్శల దాడి చేస్తున్నారు . సారా కాంట్రాక్టర్లు, అవినీతి పరులకు వైసీపీలో సీట్లు కేటాయిస్తారా..అంటూ .. రంగా, రాధా మిత్రమండలి జగన్ పై ఆగ్రహం తో ఊగిపోతోంది.

ఒక పక్క ఇదిలా ఉంటే.. వంగవీటి రంగా విగ్రహం దగ్గర రాధా అనుచరులు అప్పుడే నిరసనకు దిగారు. రంగా ఇంటి దగ్గర, ఆఫీస్‌ దగ్గరున్న వైసీపీ ఫ్లెక్సీలను తొలగించారు. దీనితో ప్రస్తుతం విజయవాడ లోని రంగా ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తామంతా పార్టీ పదవులకు రాజీనామా చేస్తామని రాధా అనుచరులు అధిష్ఠానాన్ని ఒకింత హెచ్చరించారు. అయితే ఈ మొత్తం వ్యవహారంపై వైసీపీ అధిష్ఠానం ఎలా స్పందిస్తుందో మరి కాసేపట్లో తేలనుంది .