శివరాత్రి ఉపవాసం, జాగారం.. పాటించాల్సిన నియమాలు

వేదాల్లో రుగ్వేదం చాలా గొప్పది. ఇందులోని రుద్రం ఇంకా గొప్పది. పంచాక్షరీలోని శివ అనే రెండక్షరాలు మరింత గొప్పవి. శివ అంటే మంగళకరమని అర్థం. పరమ మంగళకరమైనది శివస్వరూపం. ఆ పరమ శివుడి అనుగ్రహం పొందడానికి మనం జరుపుకునే ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి. దేశవ్యాప్తంగా హిందువులు జరుపుకునే ప్రధాన పండుగల్లో ఇది కూడా ఒకటి. మాఘమాసం బహుళ చతుర్దశి నాడు పరమేశ్వరుడు లింగరూపంలో ఉద్భవించినట్లు పురాణాలు పేర్కొన్నాయి. లింగోద్భవం జరిగిన రోజే మహాశిరాత్రిగా జరుపుకుంటారు. శివుడి పండుగల్లో ఇది ప్రధానమైంది.

ఈరోజున శివుడ్ని లింగాత్మకంగా ఆరాధించిన వారెవరైనా పురుషోత్తముడు అవుతాడని పురాణాల ఉవాచ. మహాశివరాత్రి రోజున శివ ప్రతిష్ట చేసినా, శివపార్వతుల కళ్యాణం చేసినా ఎంతో శ్రేష్టం. మహాశివరాత్రి రోజు తనను పూజిస్తే తన కుమారుడైన కుమారస్వామి కన్నా ఇష్టులవుతారని సాక్షాత్తు పరమశివుడే చెప్పాడంటే దీని విశిష్టతను అర్థంచేసుకోవచ్చు. త్రయోదశినాడు ఒంటిపొద్దు ఉండి చతుర్థశినాడు ఉపవాసం ఉండాలి. అష్టమి సోమవారంతో కూడి వచ్చే కృష్ణ చతుర్థశి నాటి మహాశివరాత్రి మరింత శ్రేష్టమైందంటారు.

ఎంతో పవిత్రమైన ఈ రోజున శివుణ్ని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. శివపురాణంలో శివరాత్రి పూజ విధానాన్ని శ్రీకృష్ణుడుకి ఉపమన్యు మహర్షి వివరించాడు. ఈ రోజున పరమేశ్వరుణ్ని భక్తులు మూడు విధాలుగా పూజిస్తారు. అవి.. శివపూజ, ఉపవాసం, జాగారం. వీటిలో ఉపవాసానికి చాలా ప్రాధాన్యత ఉంది. మహాశివరాత్రినాడు ఉపవాసం చేసి శివనామ స్మరణ చేయడం కన్నా ముఖ్యమైంది మరొకటి లేదు. ఉపవాసం వల్ల శారీరక శుద్ధి, జాగారం చేస్తూ ధ్యానం చేయడం వల్ల మనోశుద్ధి కలుగుతాయి.