జనసేన వైపు మాజీ మంత్రి చూపు ..!

janasena,pawan kalyan,power star pawan kalyan,trendingandhra

కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నేత, మాజీ మంత్రి వట్టి వసంత కుమార్‌ రాజీనామాస్త్రం సంధించారు. పార్టీలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై పూర్తిస్థాయి అసంతృప్తి ప్రకటించారు. ఇన్ని దశాబ్దాలు పార్టీని అంటిపెట్టుకుని ఉన్నందుకు అధిష్టానం తీసుకున్న నిర్ణయాలు ఎంత మాత్రం ఆమోద యోగ్యం కాదని, తెలుగుదేశంతో మిత్రత్వం కోరుకోవడాన్ని హర్షించలేక పోతున్నట్టు వసంతకుమార్‌ ప్రకటించారు.

నేరుగా తన రాజీనామా పత్రాన్ని ఏఐసీసీకి పంపానని గురువారం రాత్రి చెప్పారు. తీవ్ర మానసిక ఆవేదనతోనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. వసంతకుమార్‌ తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్‌ను ఒక కుదుపు కుదిపింది. సాధారణంగా కాంగ్రెస్‌నే నమ్ముకుని నాలుగు దశాబ్దాలుగా వసంత్‌ రాజకీయాలు నెరపుతున్నారు. 2014 రాష్ట్ర విభజన సందర్భంలో పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించలేక మిన్నకుండిపోయారు.

సీనియర్‌గా ఉన్న వసంత్‌ ఆలోచనా సరళిని ఇప్పటికే పార్టీ పెద్దలు కొందరు సమర్దించారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ హఠాత్తుగా ఢిల్లీ పరిణామాలు గురువారం వేడెక్కాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ భేటీ కావడం, ఇరు పార్టీలు స్నేహపూరితంగా వ్యవహరించేందుకు సిద్ధం కావడంతో సీనియర్‌ నేత వసంతకుమార్‌ తట్టుకోలేకపోయారు.

పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మరేదైనా పార్టీలో చేరే అవకాశం ఉందా అనే ప్రశ్నకు.. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్‌కు రాజీనామా చేశానని ఆయన పదేపదే చెప్పారు. వసంత్‌ రాజీనామాతో ఆయన అనుచర వర్గం గురువారం రాత్రి డీలా పడింది. ఆయన బాటలోనే వారు ప్రయాణించే అవకాశం లేకపోలేదు. అయితే ఆయన జనసేన వైపు వెళ్ళే అవకాశాలున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.