‘పోలీస్’, ‘ప్రెస్’ స్టిక్కర్లతో తిరిగితే ఇక అంతే !

ఏదైనా సరే ఒక ఘటన జరిగితేనే మన పోలీసులకి చురుకు తగులుతుంది, అది తగిలిన కొన్ని రోజులు హడావిడిగా ఆర్భాటం చేయడం తర్వాత సద్దుమణిగాక మళ్లి మామూలే అవ్వడం వారికి షరా మాములే.
అటువంటిదే ఒక ఘటన ఇప్పుడు వారిని ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. హైదరాబాద్ నగర పరిధిలో గతవారం ఓ యువకుడు ‘పోలీస్’ అని స్టిక్కర్ వేసున్న కారులో లాఠీతో సహా ప్రయాణిస్తూ డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన సంగతి తెలిసిందే. అలాగే సమయంలో గోషామహల్, కంచన్ బాగ్ తదితర ప్రాంతాల్లో తాము విలేకరులమని చెప్పి కొందరు వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఫిర్యాదులూ అందాయి.
దీంతో దిద్దుబాటు చర్యలు మొదలెట్టిన ఖాకీలు ‘పోలీస్’, ‘ప్రెస్’ అని నకిలీ స్టిక్కర్లు తగిలించుకుని కార్లు, ద్విచక్ర వాహనాల్లో తిరుగుతున్న వారి మీద చర్యలు ప్రారంభించారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు నిన్న వివిధ కూడళ్లలో మకాంవేసి, కేవలం పోలీస్, ప్రెస్ అని స్టిక్కర్లున్న వాహనాలనే ఆపి తనిఖీలు చేశారు.
ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టగా, మొత్తం 50 మంది నకిలీలు దొరికిపోయారు. తొలి తప్పుగా భావించి, వారి వాహనాలకు స్టిక్కర్లను తొలగించి, జరిమానా విధించినట్టు హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం జాయింట్ కమిషనర్ రవీందర్ వెల్లడించారు. నకిలీలను ఏరివేసేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని, ఇకపై సడన్ గా చెకింగ్ లు నిర్వహించి, నకిలీలకు చెక్ పెడతామని తెలిపారు.