శ్రీవారికి ఎన్ని రకాల లడ్డూలు ప్రసాదం గా సమర్పిస్తారో తెలుసా …..?

srivari laddu , Trendingandhra

తిరుమల లడ్డూ అంటే భక్తులు మనసు పారేసుకుంటారు. రోజూ లక్షన్నర లడ్డూలను తయారు చేయించి టీటీడీ భక్తులకు పంపిణీ చేస్తోంది. ఏడాది మొత్తం మీద చూసుకుంటే లడ్డూల పంపిణీ 5 కోట్ల నుంచి 10 కోట్ల మధ్యలో ఉంటోంది. ఇక్కడ తయారయ్యే లడ్డూకు జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ గుర్తింపు ఉంది. అంటే తిరుపతి లడ్డూని అదే రూపంలో, అదే పేరుతో వేరొకరు తయారు చేయడానికి వీలులేదు. స్వామి వారికి లడ్డూ నైవేద్య సమర్పణ 1715 ఆగస్ట్ 2న ప్రారంభమైందని చెబుతారు.

లడ్డూలో కలిపే పదార్థాల ఫార్ములాలో ఇప్పటి వరకు ఆరు సార్లు మార్పులు జరిగాయంటారు. శనగపిండి, జీడిపప్పు, ఆవు నెయ్యి, పంచదార, యాలకులు, పటికబెల్లం, ఎండుద్రాక్షలతో లడ్డూలను తయారు చేస్తారు. రోజూ లడ్డూల తయారీకి సుమారుగా 10 టన్నుల శనగపిండి, 10 టన్నుల పంచదార, 700 కిలోల జిడిపప్పు, 150 కిలోల యాలకులు, 500 లీటర్ల వరకు నెయ్యి, 500 కిలోల వరకు పటికబెల్లం వినియోగిస్తుంటారు.

తిరుపతి లడ్డూ అంటే మనకు ఒకటే తెలుసు. కానీ ఇందులోనూ కొన్ని రకాలు ఉన్నాయి. సాధారణంగా భక్తులకు పంపిణీ చేసే లడ్డూలను ప్రోక్తం లడ్డు అంటారు. దీని బరువు 175 గ్రాములు. కల్యాణోత్సవ లడ్డూ అని మరొకటి ఉంది. స్వామి వారి కల్యాణోత్సవ సేవ చేయించుకున్న భక్తులకు అందిస్తారు. వీటిని తక్కువ సంఖ్యలోనే తయారు చేస్తారు. అలాగే ప్రత్యేక పర్వదినాల్లో స్వామి వారికి ఆస్తానం లడ్డూ అని 750 గ్రాములతో చేసి నివేదిస్తారు. ఈ లడ్డూలో జీడిపప్పులు, ఎండు ద్రాక్ష, బాదం, కుంకుమ పువ్వులను అధిక పరిమాణంలో వినియోగిస్తారు.’