ధోనీ కెరియర్ ముగిసినట్టేనా …..విండీస్‌ , ఆస్ట్రేలియా లతో మ్యాచ్ లకి టీం ప్రకటన

ms dhoni , dhoni,trendingandhra

భారత మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీపై తొలిసారిగా సెలెక్టర్లు వేటు వేశారు. వెస్టిండీస్‌తో జరగబోయే మూడు టీ20లతో పాటు ఆస్ట్రేలియా పర్యటనలో ఆడే మరో మూడు టీ20ల కోసం జాతీయ సెలెక్టర్లు ఒకేసారి జట్లను ప్రకటించారు. ఆశ్చర్యకరంగా ఇందులో జార్ఖండ్‌ డైనమైట్‌కు చోటు దక్కలేదు. భారత క్రికెట్‌కు మూలస్తంభంగా నిలిచిన 37 ఏళ్ల ధోనీపై సెలెక్టర్లు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి.

‘ధోనీ ఆరు టీ20ల్లో ఆడడం లేదు. మేం సమర్థుడైన రెండో వికెట్‌కీపర్‌ కోసం ఎదురు చూస్తున్నాం. అంతేకానీ అతడికి ద్వారాలు మూసుకుపోలేదు’ అని స్పష్టం చేశారు. అందుకే రిషభ్‌ పంత్‌తో పాటు దినేశ్‌ కార్తీక్‌లను ఈ ఆరు మ్యాచ్‌ల కోసం ఎంపిక చేశారు. మరోవైపు వెస్టిండీస్‌తో జరిగే చివరి రెండు వన్డేలకు కేదార్‌ జాదవ్‌ను జట్టులోకి తీసుకున్నారు. అలాగే న్యూజిలాండ్‌ ‘ఎ’తో జరిగే నాలుగు రోజు ల మ్యాచ్‌ కోసం ప్రకటించిన భారత్‌ ‘ఎ’ జట్టులో తెలుగు క్రికెటర్లు సిరాజ్‌, విహారి, భరత్‌లకు చోటు దక్కింది.

team-india, trendingandhra

టీ20ల్లో ధోనీ ఇటీవలి ఫామ్‌ పేలవంగా ఉంది. ఎలాగూ మరో రెండేళ్లలో జరిగే టీ20 వరల్డ్‌కప్‌లో అతడు ఆడే అవకాశం లేకపోవడంతో ఇప్పుడే అతడి వారసుడిని ఎంపిక చేసుకుంటే మేలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. ఐపీఎల్‌లో విశేషంగా రాణించిన యువ కీపర్‌ రిషభ్‌ పంత్‌ ఇప్పటికే తన సత్తాను నిరూపించుకుంటున్నాడు. అలాగే ఈ ఫార్మా ట్‌లో దినేశ్‌ కార్తీక్‌ కూడా తనకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు.

విండీస్‌తో మూడు టీ20లకు రోహిత్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్‌కు కోహ్లీకి విశ్రాంతినిచ్చారు. టెస్టు సిరీస్‌తో పాటు ఐదు వన్డేల సిరీస్‌ పూర్తిగా ఆడుతుండడంతో అతడిపై పనిభారం పడకూడదని సెలెక్టర్లు భావించారు. అయితే నవంబరు 21 నుంచి ఆసీస్‌తో జరిగే టీ20 సిరీస్‌లో కోహ్లీ ఆడనున్నాడు. లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ షాబాజ్‌ నదీమ్‌తో పాటు క్రునాల్‌ పాండ్యా కూడా విండీస్‌తో పోరుకు జట్టులో చోటు దక్కించుకున్నారు.

ఆసీస్‌తో టెస్టులకు రోహిత్‌, విజయ్‌: సూపర్‌ ఫామ్‌లో ఉన్న రోహిత్‌కు తిరిగి టెస్టుల్లో పిలుపు వచ్చింది. అలాగే ఇంగ్లండ్‌ టూర్‌లో దారుణంగా విఫలమైన మురళీ విజయ్‌కు మరోసారి అవకాశం దక్కింది. ఆసీస్‌ పర్యటనలో ఆడే నాలుగు టెస్టుల సిరీస్‌ కోసం 18 మంది ఆటగాళ్లను ఎంపిక చేశారు.

విండీస్‌తో టీ20 సిరీస్‌‌కు భారత జట్టు ;
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), ధవన్‌, కె.ఎల్‌ రాహుల్‌, దినేష్‌ కార్తీక్‌, మనీష్‌ పాండే, శ్రేయాస్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), క్రునాల్‌ పాండ్యా, వాషింగ్టన్‌ సుందర్‌, యజ్వేంద్ర చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, భువనేశ్వర్‌, జస్ర్పీత్‌ బుమ్రా, ఖలీల్‌ అహ్మద్‌, ఉమేష్‌ యాదవ్‌, షాబాజ్‌ నదీమ్‌.

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ ;
కోహ్లీ (కెప్టెన్‌), మురళీ విజయ్‌, రాహుల్‌, పృథ్వీ షా, పుజారా, రహానె, హనుమ విహారి, రోహిత్‌, పంత్‌, పార్థివ్‌ పటేల్‌, అశ్విన్‌, జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, షమీ, ఇషాంత్‌, ఉమేష్‌, బుమ్రా, భువనేశ్వర్‌.

ఆసీస్‌తో టీ20 సిరీస్‌ ;
విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌ (వైస్‌ కెప్టెన్‌), ధవన్‌, రాహుల్‌, అయ్యర్‌, మనీష్‌ పాండే, దినేష్‌ కార్తీక్‌, పంత్‌ (వికెట్‌ కీపర్‌), కుల్దీప్‌, చాహల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, క్రునాల్‌ పాండ్యా, భువనేశ్వర్‌, బుమ్రా, ఉమేష్‌, ఖలీల్‌ అహ్మద్‌.