చివరికి గెలిచిన రో ‘హిట్ ‘ సేన ..!

rohit sharma latest cricket news,latest cricket news,india latest cricket news,rohit sharma live cricket updates,trendingandhra

110 పరుగుల లక్ష్యం.. భీకర ఫామ్‌లో ఉన్న భారత జట్టు ముందు ఇదో స్కోరా.. అనిపించినా బరిలోకి దిగాక పరిస్థితి మారింది. ఒషేన్‌ థామస్‌ గంటకు 149 కి.మీ వేగంతో బంతులు విసురుతుంటే బ్యాట్స్‌మెన్‌కు పరుగులు తీయడమే కష్టమైంది. ఫలితం.. 45 పరుగులకే నాలుగు వికెట్లు ఫట్‌. ఈ దశలో వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ అండగా నిలిచాడు. ఆఖర్లో ఆల్‌రౌండర్‌ క్రునాల్‌ పాండ్యా మెరుపులు కూడా తోడవడంతో తొలి టీ20లో భారత్‌ మరో 13 బంతులుండగా గెలిచింది.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీ్‌సను భారత పేసర్లు ఆరంభం నుంచే వణికించగా మధ్యలో స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ దెబ్బకు కుదేలైంది. అలాగే తన చివరి మూడు ఓవర్లలో క్రునాల్‌ పాండ్యా కేవలం నాలుగు పరుగులే ఇవ్వడంతో విండీస్‌ స్కోరుకు బ్రేక్‌లు పడింది. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే హోప్‌ (14) రెండు ఫోర్లతో జోరు చూపించాడు. అయితే వరుసగా మూడు ఓవర్లలో ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు చేరడం ఇబ్బందిపెట్టింది. ఓ మోస్తరు లక్ష్యమే అయినా భారత్‌ ఆరంభం కుదురుగా సాగలేదు. విండీస్‌ పేసర్‌ థామస్‌ నిప్పులు చెరిగే బంతులకు భారత్‌ 16 పరుగులకే ఓపెనర్లను కోల్పోయింది. అతడు తన తొలి రెండు ఓవర్లలోనే రోహిత్‌ (6), ధవన్‌ (3)లను అవుట్‌ చేసి షాకిచ్చాడు. ఆ తర్వాత కెప్టెన్‌ బ్రాత్‌వైట్‌ విజృంభించి తన వరుస ఓవర్లలో పంత్‌ (1), రాహుల్‌ (16)ను పెవిలియన్‌కు చేర్చడంతో ఈడెన్‌లోని అభిమానుల్లో నిశ్శబ్దం ఆవరించింది. ఈ దశలో.. అవకాశం కోసం ఎదురుచూస్తున్న దినేశ్‌ కార్తీక్‌ జట్టుకు అండగా నిలిచాడు. మనీష్‌ పాండే (19)తో కలిసి అతడు ఐదో వికెట్‌కు 38 పరుగులు జోడించాడు. అత్యంత వేగంగా బంతులు విసురుతున్న థామస్‌ బౌలింగ్‌లో ఫైన్‌ లెగ్‌లో సిక్సర్‌ బాదిన కార్తీక్‌.. 12వ ఓవర్‌లో మూడు ఫోర్లు కొట్టాడు. అయితే 15వ ఓవర్‌లో పాండే అవుటైనా క్రునాల్‌ పాండ్యా చూడచక్కని షాట్లతో ఒత్తిడిని తగ్గిస్తూ మూడు ఫోర్లు బాదాడు. దీంతో 17.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసుకుంది.