ఆ ఎంపీ కి తెగనచ్చేసిన జనసేన మేనిఫెస్టో..!

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విడుదల చేసిన పార్టీ మేనిఫెస్టో ఎంతో బాగుందని మాజీ ఎంపీ చేగొండి హరరామజోగయ్య అభిప్రాయపడ్డారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పవన్‌ విడుదల చేసిన విజన్‌ డాక్యుమెంటరీలో అంశాలు అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే విధంగా ఉన్నాయని, అయితే మ్యానిఫెస్టో రూపకల్పనపై మరింత దృష్టి పెట్టాలని అయన సూచించారు.

ఈ డాక్యుమెంటరీలో వివిధ వర్గాల ప్రజలకు హామీలు జనరంజకంగా ఉన్నాయని, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రాజకీయ రిజర్వేషన్లు ఇప్పించడానికి తమ పార్టీ కట్టుబడి ఉందని చెప్పడం, ప్రతి కుటుంబంలోనూ ఉచితంగా గ్యాస్‌ సిలెండర్‌ ఇస్తానని హామీ ఇవ్వడం, తెల్లకార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ప్రస్థుతం ఇస్తున్న రేషన్‌కు బదులుగా మహిళల పేరున బ్యాంకులో రూ.2500లు నుంచి రూ.3500లు వరకూ నగదు ఇస్తామని హామీ ఇవ్వడం చూస్తే మహిళల పట్ల జనసేన పార్టీకి ఉన్న ప్రేమ, శ్రద్ధ విశదమవుతుందని, దీనిపై మరింత అద్యయనం చేయాల్సి ఉందన్నారు.

చట్టసభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించడానికి శ్రద్ధ వహిస్తామని చెబుతూ ఉద్యోగాలలో, విద్యాలయాల్లో బీసీలకు మరో 5శాతం రిజర్వేషన్లు పెంచడానికి కృషి చేస్తామని చెప్పడం ద్వారా బీసీలకు న్యాయ చేయడమే కాకుండా ఆయా వర్గాలను పార్టీ వైపు తిప్పుకోవడానికి మేలు చేస్తుందన్నారు.

కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న కాపు రిజర్వేషన్లు బిల్లును 9వ షెడ్యూల్‌లో చేర్చడానికి తగిన కృషి చేస్తామని చెప్పడం కాపు కులస్థులపై జనసేన పార్టీకున్న బాధ్యతను తెలియపరిచిందన్నారు.ఆర్థికంగా వెనుకబడి ఉన్న అగ్రకులాలకు కార్పొరేషన్లు ఏర్పాటుతో వారి అభ్యున్నతికి జనసేన కట్టుబడి ఉన్నట్టు ప్రకటించడం హర్షించదగ్గ విషయమన్నారు.