ప్రేమికుల రోజున జియో శుభవార్త

ప్రేమికుల దినోత్సవం నాడు రిలయన్స్ జియో శుభవార్త చెప్పింది. నేటి నుంచి జియో ఫీచర్ ఫోన్లలో ఎంచక్కా ఫేస్‌బుక్‌ను ఎంజాయ్ చేయొచ్చని పేర్కొంది. జియో ఫోన్ల కోసం కొత్తగా కై ఓఎస్‌తో పనిచేసే ఫేస్‌బుక్ యాప్‌ను అభివృద్ధి చేసింది. నేటి నుంచి దీనిని జియో యాప్ స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.జియో ప్రకటనతో ఫీచర్ ఫోన్ యూజర్లు సంబరపడిపోతున్నారు. ఫీచర్ ఫోన్ సెగ్మెంట్‌లో నాలుగో త్రైమాసికంలో 27 శాతం మార్కెట్‌తో మార్కెట్ లీడర్‌గా అవతరించింది.ట్రాన్స్‌ఫార్మేషనల్ టెక్నాలజీతో తీసుకొచ్చిన జియో ఫోన్ ప్రపంచంలోనే అతి చవకైన ఫీచర్ ఫోన్. ఈ ఫోన్‌ను విడుదల చేయడం ద్వారా దేశంలోని 2జీ వినియోగదారులను జియో తనవైపు తిప్పుకుంది. జియోతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని ఫేస్‌బుక్ మొబైల్ పార్ట్‌నర్‌షిప్ ఉపాధ్యక్షుడు ఫ్రాన్సిస్కో వరెలా తెలిపారు.

జియో ఫోన్ ద్వారా లక్షలాదిమందికి ఫేస్‌బుక్ చేరువకానుండడం ఆనందంగా ఉందన్నారు. కాగా, ఫేస్‌బుక్‌ను అందుబాటులోకి తెచ్చిన జియో అతి త్వరలోనే వాట్సాప్‌ను కూడా తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందని జియో వర్గాల సమాచారం.