కోహ్లీ @ 10000 ……!

virat kohli , trendingandhra
వెస్టిండీస్‌తో వైజాగ్‌ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి రికార్డు సృష్టించాడు. అచ్చొచ్చిన మైదానంలో తన ఫామ్‌ను కొనసాగిస్తూ అంతర్జాతీయ వన్డేల్లో అత్యంత వేగంగా పదివేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. తద్వారా సచిన్‌ పేరిట ఉన్న రికార్డును బ్రేక్‌ చేశాడు. వన్డేల్లో పదివేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి సచిన్ టెండూల్కర్ 259 ఇన్నింగ్స్‌లు తీసుకోగా సౌరవ్ గంగూలీ 263, రికీ పాంటింగ్‌ 266 ఇన్నింగ్స్‌లు ఆడారు. అయితే కోహ్లి మాత్రం 205 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనతను అందుకొని రికార్డు సృష్టించాడు.

ఈ మ్యాచ్‌కు ముందు ఈ ఫీట్‌ సాధించడానికి కోహ్లి 81 పరుగులు దూరంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో అశ్లేనర్స్‌ వేసిన 37వ ఓవర్‌ మూడో బంతిని కోహ్లి సింగిల్‌ తీసి 10వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. దీంతో ఈ క్లబ్‌లో చేరిన ఐదో భారత ఆటగాడిగా ఓవరాల్‌ 13వ ఆటగాడిగా గుర్తింపు పొందాడు. కోహ్లి కన్నా ముందు భారత నుంచి సచిన్‌, గంగూలీ, ద్రవిడ్‌, ధోనిలు ఈ ఫీట్‌నందుకున్నారు.

అంతర్జాతీయ వన్డేల్లో అరేంగేట్రం చేసిన 3270 రోజుల్లోనే కోహ్లి 10వేల జాబితాలో చేరాడు. ఇప్పటి వరకు ద్రవిడ్‌ ఒక్కడే 3969 రోజుల్లో ఈఘనతను అందుకోగా కోహ్లి తాజాగా అధిగమించాడు. జయసూర్య 11296 బంతుల్లో 10వేల పరుగులు పూర్తి చేయగా కోహ్లి కేవలం 10813 బంతుల్లోనే ఈ మైలురాయిని అందుకున్నాడు. ఇక కోహ్లి ఖాతాలో 36 సెంచరీలున్నాయి.

#kohliBreaksSachinTendulkarsRecordAsFastestTo10000ODIRuns #ViratKohli #WestindiesvsIndia