తివారీకి తీవ్ర అస్వస్థత !

ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ మనందరికీ గుర్తుండే ఉంటారు.

ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 2007 నుంచి 2009 వరకు గవర్నర్‌గా పనిచేసిన తివారీ, ఆ సమయంలో రాజభవన్‌‌లో పలువురు యువతులతో రాసలీలలు ఆడినట్టు వార్తలు వచ్చాయి. అప్పట్లో ఈ వార్త దేశవ్యాప్తంగా పెను దుమారమే రేగింది. దీంతో స్పందించిన యూపీఏ ప్రభుత్వం నష్టనివారణ చర్యలు ప్రారంభించి, ఆయనను పదవి నుంచి తప్పించింది. ఇదొక్కటే కాదు తాను తివారీ కొడుకుని అంటూ ఒక యువకుడు సుప్రీం కోర్టు మెట్లు సైతం ఎక్కాడు.

అంతలా వార్తలలో నిలిచిన ఆయన మరో మారు వార్తలలోకి ఎక్కారు. ఆయన తీవ్ర అస్వస్థతో హాస్పిటల్‌లో చేరారు. వైద్యం కోసం హాస్పిటల్‌లో చేరిన ఆయన పరిస్థితి విషమంగానే ఉందని, మరో 72 గంటలు గడిస్తేగానీ చెప్పలేమని వైద్యులు ప్రకటించారు. రక్తపోటు, తీవ్ర జర్వంతో బాధపడుతూ సోమవారం నాడు ఢిల్లీలోని మ్యాక్స్‌సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరిన ఆయనను ఐసీయూకి తరలించారు.

ఐసీయూలో చికిత్స పొందుతోన్న తివారీ ఆరోగ్య పరిస్థితి గురించి 48 నుంచి 72 గంటలు గడిస్తే గానీ ఏ విషయమూ వెల్లడించలేమని పేర్కొన్నారు వైద్యులు. మధ్యాహ్నం ఇన్ఫెక్షన్ కారణంగా జ్వరం సోకగా, ఆ వెంటనే రక్తపోటు ప్రమాదకరస్థాయికి పడిపోయిందని వైద్యులు తెలిపారు. న్యూరాలజీ నిపుణుడు ముఖర్జీ, కార్డియాలజీ నిపుణుడు సుమీత్ సేథి బృందం తివారీకి వైద్య సేవలు అందిస్తున్నట్టు ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది.